
విద్యార్థులకు ప్రభుత్వ విద్య దూరం
నూజివీడు: విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను ప్రైవేటుపరం చేస్తోందని ఏఐఎస్‌ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి.శివ కుమార్ విమర్శించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరిగే బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ పట్టణంలోని అమర్‌భవన్‌లో మంగళవారం పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే నూజివీడులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే పీపీపీ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డిగ్రీ విద్యను అభ్యసించడానికి నూజివీడులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో సమీపంలోని అనేక గ్రామాల నుంచి విద్యను అభ్యసించడానికి నూజివీడు వస్తున్న విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు సొమ్ము చెల్లించలేక తమ చదువులకు మధ్యలోనే స్వస్తి పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకురాగా, కూటమి ప్రభుత్వం 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ నిరుపేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయడం దుర్మార్గమన్నారు.