
కార్తీక స్నానాలకు ఏర్పాట్లు
ముసునూరు: ఈ నెల 22 బుధవారం నుంచి ఆరంభం కానున్న కార్తీక మాస పుణ్య స్నానాలు, స్వామి దర్శనాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు బలివే రామలింగేశ్వరస్వామి ఆలయ ఈఓ పామర్తి సీతారామయ్య చెప్పారు. మంగళవారం ఆయన కార్తీక మాస ఏర్పాట్లను వివరించారు. వేలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ అధికారులతో కలసి, తమ్మిలేరు స్నాన ఘట్టాల వద్ద పుణ్య స్నానాలాచరించే భక్తుల సౌకర్యార్ధం, ప్రమాదాల నివారణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేయించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పూజలు, అభిషేకాలు, దైవ దర్శనానికి హాజరయ్యే భక్తులకు ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఆటంకం లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు.
ఏలూరు (టూటౌన్): దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశం మంగళవారం ఏలూరులో జరిగింది. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ కె వీర్రాజు, అధ్యక్షుడు కుందేటి జయరాజు, కార్యదర్శి ఎల్.రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇళ్ల వద్దకే రేషన్ అందించాలని చెప్పినప్పటికీ, చాలాచోట్ల రేషన్ అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ అందించేవారని గుర్తు చేశారు. సమావేశంలో ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి లక్కపాము రాంబాబు, ఉపాధ్యక్షుడు సీహెచ్ వాసు, కోశాధికారి భూలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
నూజివీడు: ఉద్యోగులకు డీఏపై జారీ చేసిన జీఓ విషయంలో ప్రభుత్వ తీరు సమంజసంగా లేదని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్‌జీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెరగడ్డ సత్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామని, పెన్షనర్లకు 2027–28 ఆర్థిక సంవత్సరంలో 12 విడతలుగా చెల్లిస్తామని తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సరండర్ లీవ్ బిల్లులు చాలా ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉండగా వాటిపైనా ప్రతి ఏటా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నామన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు రూ.3520 కోట్లను పీఎఫ్ ఖాతాలకు జమ చేస్తామని సీఎం తెలిపారని, సీఎం చేసిన ప్రకటనకు భిన్నంగా పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం ఉద్యోగులను మోసం చేయడమేనన్నారు.
పెనుగొండ: కార్తీక మాసం సమీపిస్తుండడంతో కేదారీఘాట్ రేవుల దుస్థితిపై సాక్షిలో ప్రచురితమైన కథనానికి పంచాయతీ, దేవదాయ శాఖాధికారులు స్పందించారు. అధ్వానంగా మారిన సిద్ధాంతం కేదారీఘాట్ రేవులను పంచాయతీ, దేవదాయ శాఖల ఆధ్యర్యంలో శుభ్రం చేశారు. సర్పంచ్ చింతపల్లి గనిరాజు(చంటి), దేవస్థానం అధికారి ముత్యాల సత్యనారాయణల ఆధ్వర్యంలో రేవుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు,
ఏలూరు(మెట్రో): జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతాలలో భూగర్భ జలాల స్థాయి తక్కువగా ఉందని, భూగర్భ జలాల స్థాయిని గణనీయంగా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 1513 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా, వాటిలో మొదటి దశలో 175 చెరువులకు మరమ్మతులు, పునరుద్ధరణ, పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించామన్నారు.

కార్తీక స్నానాలకు ఏర్పాట్లు