
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ
బుట్టాయగూడెం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ మంగళవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త కాలేజీలను ఆపేయాలని కుట్ర పన్నారన్నారు. 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఈ కాలేజీలు ప్రైవేటుపరమైతే పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య, నాణ్యమైన వైద్యం దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ హయాంలో సుమారు రూ.50 కోట్లతో బుట్టాయగూడెం సమీపంలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. సుమారురూ.12 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, కొయ్యలగూడెం మండలాలతో పాటు పరిసర ప్రాంతంలోని మండలాల ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చందా ప్రసాద్, జెడ్పీటీసీ మల్లం వసంతరావు, వైస్ ఎంపీపీలు సోమగాని శ్రీను, ఉప్పల లలితకుమారి, పార్టీ జిల్లా కార్యదర్శి బోదా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.