
చట్టాలపై అవగాహన అవసరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థులు బాల్య దశ నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.రత్నప్రసాద్ సూచించారు. బుధవారం స్థానిక సీఆర్‌రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో లీగల్ లిటరసీ క్లబ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య దశలోనే విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించడం కోసం ప్రతి తరగతి నుంచి ఒక్కొక్క విద్యార్థిని ఎన్నుకొని వారికి చట్టాలపై అవగాహన కలిగించి వారి ద్వారా తరగతిలోని విద్యార్థులకు చట్టాలపై మరింత అవగాహన కలిగించడానికి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 18 పాఠశాలల్లో ఈ లీగల్ లీటరసీ క్లబ్స్ పనిచేస్తున్నాయని, ఏలూరులో సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్, జడ్పీ హైస్కూల్ శనివారపు పేట, చాటపర్రు పాఠశాలలను ఎన్నుకొని ఈ లీగల్ లిటరసీ క్లబ్‌లను ఏర్పాటు చేసి తద్వారా విద్యార్థులకు చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగించడం కోసం న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫె్‌న్స్ కౌన్సిల్ పీవీఎన్ మునీశ్వరరావు, న్యాయవాది పీ.రత్నరాజు సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పీ.సాయి కుమారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.