
‘కళ్ల కలక’లం
దెందులూరు: శరీరంలో ఏ భాగానికి అనారోగ్యం వచ్చిన తట్టుకోవచ్చు కానీ కళ్లకు చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేం. వర్షాకాలం కావడంతో జిల్లాలో కళ్ల కలకతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వైరస్ వల్ల సోకే ఈ అంటువ్యాధి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలు
కళ్ళు ఎరుపుగా మారి వెలుతురు చూడలేకపోవడం. కంటి నుంచి నీరు కారటం, దురద, మంట, పుసులు కట్టడం, కన్ను నొప్పి.
వ్యాధి వ్యాప్తి
కళ్ల కలక ఉన్న వ్యక్తి వాడిన వస్తువులు వ్యాధి లేని మరో వ్యక్తి తాకి కళ్లను ముట్టుకోవడం వల్ల ఇది వ్యాపిస్తుంది.
నివారణ చర్యలు
గోరువెచ్చని నీటితో కళ్లను తరచూ శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన తువాలుతో కళ్లను తుడవాలి. కళ్లద్దాలు ధరించాలి. వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. కళ్లలో మందులు వేయడానికి ముందు తరువాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.
చేయకూడనివి
కళ్ల కలక ఉన్న వ్యక్తి వాడిన టవల్స్, దిండ్లు, దుప్పట్లు వేరొకరు వాడకూడదు. కళ్ళు ఎరగ్రా ఉంటే పాఠశాలకు పంపించకూడదు. కళ్ళలో ఆకుపసరు వంటివి వేయకూడదు. మూడు నుంచి నాలుగు రోజుల్లో పరిస్థితి మెరుగు పడకపోతే కంటి వైద్యుడిని సంప్రదించాలి. కళ్ల కలక విస్తరింపకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
అవగాహన సమావేశాలు
కళ్ల కలక లక్షణాలు, నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దెందులూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నా. కళ్ల కలక విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్ సుందర్ బాబు, సూపరింటెండెంట్ దెందులూరు సీహెచ్‌సీ
సులువుగా వ్యాపిస్తుందంటున్న వైద్యులు
వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం

‘కళ్ల కలక’లం