నారు కీలకం.. సాగు లాభదాయకం | - | Sakshi
Sakshi News home page

నారు కీలకం.. సాగు లాభదాయకం

Jul 14 2025 5:17 AM | Updated on Jul 14 2025 5:17 AM

నారు

నారు కీలకం.. సాగు లాభదాయకం

గణపవరం: వరి సాగులో ఖర్చులు తగ్గించుకొని, అధిగ దిగుబడి సాధించి వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవడానికి ఆరోగ్యవంతమైన నారు కీలకం. ఆరోగ్యకరమైన నారుకోసం నారుమడి తయారీ నుంచి ఎంతో జాగ్రత్త అవసరం. ప్రస్తుతం రైతులు సార్వా సాగుకు సన్నద్ధమవుతున్నారు. నారుమడుల తయారీ, విత్తనాలు చల్లుకోవడం, నారు సస్యరక్షణ పనుల్లో బిజీగా ఉన్నారు. కొన్ని చోట్ల నాట్లుకూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నారుమడి తయారీ, సస్యరక్షణ చర్యల్లో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

నారుమడి తయారీలో పాటించాల్సిన జాగ్రత్తలు

నారుమడి వేయడానికి ఎంచుకున్న నేల పొలానికన్నా మెరకలో ఉండి, సారవంతమైనదిగా ఉండాలి. పొలాన్ని బాగా దుక్కిదున్ని కలుపు లేకుండా చూసుకోవాలి. వీలైనంత వరకూ బాగా చివికిన సేంద్రియ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అందువల్ల వేరువ్యవస్థ వత్తుగా, బలంగా తయారై, నారు పీకేటప్పుడు తెగిపోకుండా ఉంటుంది. అంతేకాక మొక్కకు అన్నిరకాల పోషకాలు పుష్కలంగా అంది, మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మూడుసార్లు దమ్ముచేసి, చదునుచేసి, నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.

విత్తడం

ఎకరా పొలంలో నాట్లు వేయడానికి 5 సెంట్ల నారుమడి సరిపోతుంది. 5 కిలోల విత్తనాలను ఒక లీటరు నీటిలో ఒక గ్రాము కార్బన్‌డిజం కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి, మొలకలు కట్టిన తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. నారు ఆకు పూర్తిగా విచ్చుకునే వరకూ ఆరుతడులు ఇచ్చుకోవాలి. తర్వాత పలుచగా నీరు పెట్టాలి. మెట్ట నారుమడికి 3 గ్రాముల కార్భన్‌డిజం కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టిన తర్వాత చల్లుకోవాలి.

పోషక యాజమాన్యం

ఎకరా నారుమడికి 6 కిలోల సింగిల్‌ సూపర్‌ పాస్ఫేటు, 1.5 కిలోల మ్యూరేట్‌ ఆప్‌ పొటాష్‌ దమ్ములో వేయాలి. రెండు కిలోల యూరియాను విత్తనాలు చల్లేముందు, ఒక కిలో యూరియా విత్తిన 10 రోజుల తర్వాత వేసుకోవాలి. దీనివలన నారు ధ్రుఢంగా పెరుగుతుంది. నారుమడిలో ఇనుపధాతు లోపం కనిపిస్తే లేత చిగురాకులపై ఇటుకరంగు మచ్చలు ఏర్పడి, నారు నిర్జీవంగా మారి ఎదుగుదల ఉండదు. దీని నివారణకు లీటరు నీటిలో 20 గ్రాముల అన్నబేధి, 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణం పిచికారీ చేసుకోవాలి.

కలుపు నివారణ

నారుమడిలో కలుపు మొక్కలు కనిపిస్తే సాధారణంగా చిన్న కమతాల నారుమడుల్లో కలుపును రైతులు లేదా కూలీలచేత తీయించి వేస్తారు. పెద్ద కమతాల రైతులు మాత్రం కలుపు నివారణకు రసాయనాలు ఉపయోగించవచ్చు. నారుమడిలో ఊద, ఇతర కలుపుజాతి మొక్కలు ఉంటే నివారణకు ఎకరా నారుమడికి 400 మి.లీ సైహలో ఫాస్‌ బ్యూటైల్‌ 10 శాతం మందును 200 మి.లీ. నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందు స్ప్రే చేసిన వారంరోజుల్లో ఊద, గడ్డిజాతి మొక్కలు మాత్రమే నశిస్తాయి. నారుకు ఎలాంటి నష్టం ఉండదు.

కలుపు మందు వాడకంలో జాగ్రత్తలు

కలుపుమందు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే నారుకు నష్టం కలుగుతుంది. సిఫార్సు చేసిన మందును, సిపార్సు చేసిన మోతాదులో వాడాలి. లేకపోతే నారుకు నష్టం కలుగుతుంది. మందు పిచికారీ చేసిన తర్వాత రెండు రోజుల వరకూ నీరు పెట్టకూడదు. భూమి పొడిగా ఉన్నప్పుడు, ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రసాయన మందులు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు రావు.

సార్వా సాగుకు రైతులు సన్నద్ధం

నారు సస్యరక్షణ పనుల్లో బిజీ బిజీ

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

విత్తిన పది రోజులకు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు ఎకరా నారుమడికి 160 గ్రాముల చొప్పున వేసుకోవాలి. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ లేదా క్లోరిఫైరిఫాస్‌ 2.0 మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి విత్తిన 10 రోజులకు, 17 రోజులకు పిచికారీ చేసుకోవాలి. నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడిలో 160 గ్రాముల కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉంచి చల్లుకోవాలి. – ఆర్‌ఎస్‌ ప్రసాద్‌, ఏవో, గణపవరం

నారు కీలకం.. సాగు లాభదాయకం 1
1/2

నారు కీలకం.. సాగు లాభదాయకం

నారు కీలకం.. సాగు లాభదాయకం 2
2/2

నారు కీలకం.. సాగు లాభదాయకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement