
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
ఏలూరు (టూటౌన్): మున్సిపాల్టీ, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఇంజినీరింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నా ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఏ.అప్పలరాజు మాట్లాడుతూ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈనెల 15న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు పి.కిషోర్, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, నాయకులు బుగత జగన్నాథరావు, పోలా భాస్కరరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు బి.నారాయణ రావు, ఎస్.శ్రీనివాస రావు, డి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.