
ఆలయ మరమ్మతులకు అంచనాలు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కొన్ని నిర్మాణాలు, మరమ్మతులు కోసం అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.శ్రీనివాసరావు శుక్రవారం ఆలయానికి విచ్చేసి, పరిసరాలకు పరిశీలించారు. 2027 గోదావరి పుష్కరాలకు మరమ్మతులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆలయంలో స్వామివారి చుట్టూ ఉన్న ప్రాకార మండపం లోపలి భాగంలో బేడా మండపం లీకేజీలు అవుతున్నాయి. అలాగే పార్వతి దేవి, లక్ష్మీదేవి గర్భాలయాల్లో కూడా వర్షం నీరు కారిపోతుంది. జనార్ధనస్వామి ఆలయం గర్భగుడిలో టైల్స్ ముక్కలుగా ఊడిపడిపోతున్నాయి. జనార్ధనస్వామి ఉపాలయం పక్కన ఉన్న బేడా మండపానికి సంబంధించి సుమారు మూడు స్తంభాలు ప్రమాదకరంగా ఒరిగిపోయి ఉన్నాయి. ముఖ్యంగా 120 అడుగుల ఎత్తయిన గాలిగోపురం లోపల శిథిలావస్థకు చేరుకుంటుంది. ఆయా సమస్యలను శ్రీనివాసరావు పరిశీలించారు.
కార్యాలయ నిర్మాణంపై తర్జనభర్జన
ప్రస్తుతం ఆలయ కార్యాలయం ఉన్న ప్రాంతంలో మరో మండపం నిర్మాణానికి అంచనాలు తయారు చేస్తున్నారు. ఆలయానికి నైరుతి మూలలో గత కొంతకాలం క్రితం ఖాళీ చేసిన ఎస్‌పీఆర్‌ఆర్ క్లబ్ స్థలం ఆలయానికి చెందినదే కావడంతో అప్పట్లో ఆ స్థలం ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో కార్యాలయం నిర్మాణం చేయడమా లేఖ అన్నదాన భవనంగా ఉంచడమా? అనే దానిపై చర్చ లు సాగుతున్నాయి. కార్యక్రమంలో దేవదాయ శాఖ భీమవరం అధికారి సూర్యప్రకాశరావు, వర్దినీడి వెంకటేశ్వరరావు, ఈఓ ముచ్చర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రసాదం తీసుకోని డీఈ
ఆలయం ప్రాకారం బేడా మండపంలో లీకేజీలను తనిఖీ చేస్తూ అంచనాలు వేస్తున్న సమయంలో పక్కన ఉన్న కనకదుర్గమ్మ వారికి తయారు చేసిన దద్దోజనం ప్రసాదాన్ని అక్కడ పురోహితులు పంచిపెడుతున్నారు. అటుగా వస్తున్న డీఈతో పాటు మిగిలిన అధికారులను సైతం అయ్యా ప్రసాదం ఇదిగోండని పెట్టగా చేతులు బాగోలేదు వద్దుల్లేండి అని వెళ్లిపోవడంతో భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది.