
విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేయాలి
ద్వారకాతిరుమల: విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేసి, కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించేలా ఫార్ములా రూపొందించాలని, అందుకు రాష్ట్ర కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని పంగిడిగూడెం జెడ్పీ హైస్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో, కోకో రైతుల ప్రాంతీయ సదస్సును మంగళవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకుడు రుద్రరాజు సుబ్బరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోకో రైతుల సమస్యలపై చర్చించి, పలు తీర్మానాలను ఆమోదించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోకో పంటను మరింతగా ప్రోత్సహిస్తామని, ప్రస్తుతం ఉన్న 75 వేల ఎకరాలకు అదనంగా మరో లక్ష ఎకరాల్లో కోకో పంట సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని ప్రకటించిందన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోకో గింజలను మార్కెట్లో అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో లక్ష ఎకరాలు పెంచితే ఆ పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోతే కోకో రైతులు మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుతరామయ్య, కోనేరు సతీష్ బాబు మాట్లాడుతూ కోకో రైతులంతా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి భవిష్యత్తులో తమ కోకో గింజలను మార్కెటింగ్ చేసుకునేలా కోకో రైతులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత సీఐటీయూ నాయకులు ఆర్.లింగరాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు మాట్లాడుతూ ప్రపంచీకరణ విధానాల వల్ల విదేశీ ఫ్రీ ట్రేడింగ్ అగ్రిమెంట్స్‌తో వాణిజ్య, వ్యాపార పంటల రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సదస్సులో ఎస్.నాగబాబు, పి.ప్రసాద్, వి.వెంకటేశ్వరరావు, తూంపాటి అజయ్ కుమార్, ఎం.మురళీ, నల్లూరి బాపనయ్య, పలు ప్రాంతాలకు చెందిన కోకో రైతులు పాల్గొన్నారు.
కోకో రైతుల సదస్సు డిమాండ్