భూ వివాదాల పరిష్కారంలో నిర్లక్ష్యం
పోలవరం: ఏజెన్సీలో భూ వివాదాలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తెల్లం రామకృష్ణ అన్నారు. సోమ వారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఎల్‌టీఆర్, 1/70 చట్టం భూములను సాగు చేస్తున్న గిరిజనులను సాగుదారులుగా రికార్డుల్లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. గిరిజనేతరులకు రెవెన్యూ అధికారులు కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. గిరిజన చట్టాలపై తహసీల్దార్‌కు కనీస అవగాహన లేదన్నారు. పోడు భూముల సాగుదారులకు హక్కు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం మండల కార్యదర్శి కారం భాస్కర్ మాట్లాడుతూ మండలంలోని వింజరంలో జీసీసీ రేషన్ దుకాణానికి కొత్త భవనం నిర్మించాలని, కొమ్ముగూడెం, వింజరం, కోయనాగంపాలెం గ్రామాల్లో శ్శశాన వా టికలకు స్థలం చూపించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ బి.సాయిరాజుకు అందజేశారు. సీపీఎం మండల కమిటీ సభ్యులు బొరగం భూచంద్రరావు, టి.శాంతికుమారి, జి.పాండవులు, డి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


