
చినవెంకన్న బంగారం.. బ్యాంకులో భద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారికి భక్తుల నుంచి ఏడాది కాలంగా హుండీలు, కానుకల ద్వారా లభించిన 4.940 కేజీల బంగారాన్ని దేవస్థానం అధికారులు గోల్డ్ బాండ్ స్కీమ్ కింద విజయవాడలోని భారతీయ స్టేట్‌బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో మంగళవారం డిపాజిట్ చేశారు. ముందుగా ఆలయ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచిన బంగారాన్ని ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి, డిప్యూటీ ఈఓ పి.బాబురావు, దేవాదాయశాఖ జ్యూయలరీ వెరిఫికేషన్ అధికారి (రాజమహేంద్రవరం) వీవీ పల్లంరాజు, ఆలయ అర్చకులు కొండూరి జనార్ధనాచార్యులు, కమిటీ సభ్యుల సమక్షంలో బయటకు తీశారు. అనంతరం బంగారాన్ని తూకం వేసి, ప్యాక్ చేశారు. ఆ ప్యాకెట్‌కు సీలు వేసి, సంబంధిత పత్రాలతో పాటు దాన్ని బ్యాంకు అధికారులకు ఆలయ ఈఓ సత్యన్నారాయణ మూర్తి, కమిటీ సభ్యులు అందజేశారు.