
ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ
తాడేపల్లిగూడెం రూరల్: ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సీ.వెంకటరమణ, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ జిల్లాలకు చెందిన ఉద్యాన శాఖ అధికారులు, రైతులతో ప్రాంతీయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం సహాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ డి.వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ టమాట, మిరపలో ప్రొసెసింగ్ టెక్నాలజీలను పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కోత అనంతరం పండ్ల తోటల్లో నష్టాన్ని అంచనా వేయడం, తద్వారా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అరటి దిగుబడిలో కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమ ముందంజలో ఉందని, దానికి కారణాలు వెతకాలన్నారు.
ఏఐని ఉపయోగించి తెగుళ్ల ఉద్ధృతిని అరికట్టాలి
రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ విదేశీ పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పంటల సాగుపై రైతులకు కావలసిన సూచనలను, సలహాలను శాస్త్రవేత్తలు అందించాలన్నారు. ఆయిల్ పామ్‌లో అంతర పంటగా సాగు చేసే కోకోలో కొత్త రకాలను తీసుకురావాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఆధారం చేసుకుని పురుగు, తెగుళ్ల ఉధృతిని, ఉనికిని కనిపెట్టడం, అవసరాన్ని బట్టి ఎరువులు, నీటి యాజమాన్యం చేపట్టాలన్నారు. వాతావరణ మార్పులకనుగుణంగా పంటల్లో పురుగు, తెగుళ్ల ఉద్ధృతిపై విస్తారంగా పరిశోధనలు జరగాలన్నారు. ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జమదగ్ని, ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ కే.టి.వెంకటరమణ, యూనివర్సిటి డీఐపీ అధికారి డాక్టర్ కే.ధనుంజయరావు, విస్తరణ పంచాలకులు డాక్టర్ బి.గోవిందరాజులు, పరిశోధన సహాయ సంచాలకులు కోస్టల్ జోన్–1 డాక్టర్ డి.వెంకటస్వామి, కోస్టల్ జోన్–1 డాక్టర్ సి.వెంకటరమణ గత ఏడాదికి గాను అధికారులు, రైతులు అడిగిన సమస్యలకు పరిష్కారాలపై చేపట్టిన పరిశోధనలు తెలిపారు. శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్‌బీవీ.చలపతిరావు, డాక్టర్ ఇ.కరుణశ్రీ, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త విజయలక్ష్మి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన ఉద్యాన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఏపీఎంఐపీ పీడీ డాక్టర్ వెంకటరమణ