
కొనసాగుతున్న కోకో రైతుల ధర్నా
దెందులూరు: కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని, కోకో రైతులను ఆదుకోవాలంటూ రైతులు శనివారం దెందులూరు మండలం సోమవరప్పాడు మోండలీజ్ కంపెనీ వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు వై. కేశవరావు, కౌలురైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ గత రెండున్నర నెలలుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నా.. కంపెనీలు స్పందించకపోగా కించపరుస్తూ మాట్లాడడం అభ్యంతకరమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలన్నారు. దేశీయంగా రైతుకు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోకో రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. రైతుల ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఈ నెల 19, 20ల్లో జరిగే చర్చలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుత రామయ్య, సహాయ కార్యదర్శి వీరారెడ్డి, మాజీ జెడ్పీటీసీ విద్యాసాగర్ మాట్లాడుతూ కోకో రైతులంతా సంఘటితంగా పోరాడాలన్నారు. ఎంతో కష్టపడి రైతు ఉత్పత్తి చేస్తున్న కోకో గింజలకు తగిన ధర ఇవ్వకుండా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ధర అమలు చేస్తూ రైతులను మోసం చేసి భయపెట్టి కోకో గింజలు కొనుగోలు చేయడం తగదన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌మాట్లాడుతూ కోకో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. రైతుల దీక్షలతో మోండలీజ్ వద్ద పోలీసుల్ని మోహరించారు. కంపెనీ మేనేజర్ రాజేష్ రామచంద్రన్, రైతుల సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. రెండు మూడ్రోజుల్లో ధర నిర్ణయంపై కంపెనీ యాజమాన్యం చర్చలకు వస్తుందని, ఆందోళన విరమించాలని కోరారు. అప్పటి వరకు కంపెనీ కార్యకలాపాలు నిలుపుదల చేయాలని రైతు సంఘాల నాయకులు కోరగా మేనేజర్ అంగీకరించారు. కంపెనీతో పాటు మిగిలిన కంపెనీలు కూడా తమ గోడౌన్లలో ఉన్న సరుకు బయటకు పంపకుండా కంపెనీల కార్యకలాపాలు నిలుపుదల చేయాలని అన్ని కంపెనీలకు సమాచారం ఇచ్చారు