
రేషన్ కోసం అవస్థలు
బుట్టాయగూడెం: రేషన్ బియ్యం కోసం నిర్వాసితులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్‌పురం మండలం తుమ్ములూరు, జిల్లేడుగొంది, కొల్లూరు, కొత్తూరు, టి.పోచవరం గ్రామాల నుంచి కొందరు నిర్వాసితులు బుట్టాయగూడెం మండలం నిమ్మలగూడెం, రామన్నగూడెంల మధ్య నిర్వాసిత కాలనీకి తరలివచ్చారు. అయితే రేషన్‌బియ్యం కోసం మాత్రం తమ సొంత గ్రామమైన వీఆర్‌పురం మండలం తుమ్ములూరు గ్రామానికి వెళ్లి వస్తున్నారు. బుట్టాయగూడెం మండలంలో ప్రస్తుతం వీరు ఉంటున్న నిర్వాసిత కాలనీ నుంచి వీఆర్ పురం మండలం తుమ్ములూరు గ్రామానికి సుమారు 235 కిలోమీటర్లు దూరం. దీంతో ప్రతినెలా రూ. 13 వేలు చెల్లించి 46 కార్డుల లబ్ధిదారులు ఆ బియ్యం తెచ్చుకుంటున్నామని నిర్వాసితులు వేట్ల ముత్యాలరెడ్డి, అందెల రామిరెడ్డి, అందెల సీతారామరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ వేరే జిల్లా కావడంతో వీలుపడడం లేదని, దీంతో ప్రతి నెలా రేషన్ కోసం సొంత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో గ్రామాలు తరలిరాకపోవడం వల్ల తమ కార్డులు ఈ మండలానికి బదిలీ కాలేదని నిర్వాసితులు చెబుతున్నారు. జూన్ మొదటి వారంలో నిర్వాసితులను పూర్తిస్థాయిలో తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నారని, కార్డులు ఈ మండలానికి మారే వరకు తమకు ఈ కష్టాలు తప్పవని వాపోయారు.

రేషన్ కోసం అవస్థలు