
కంప్యూటర్ కోర్సుకు వెళ్లి వస్తుండగా..
● మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న కంటైనర్ లారీ ● ప్రమాదంలో యువకుడి మృతి
పెంటపాడు: కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొనడంతో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాల ప్రకారం చింతపల్లి గ్రామానికి చెందిన యర్రంశెట్టి వీరవెంకట సత్యనారాయణ (సతీష్) ఇంటర్ విద్యను పూర్తి చేసుకొన్నాడు. అనంతరం ప్రతి రోజు పెంటపాడు వచ్చి కంప్యూటర్ కోర్సు నేర్చుకొంటున్నాడు. సోమవారం యథావిధిగా కంప్యూటర్ క్లాస్ ముగించుకుని మోటార్‌సైకిల్‌పై స్వగ్రామం వెళ్తూ ఉండగా పెంటపాడు కళాశాల వద్ద విశాఖపట్నం నుంచి భీమవరం వెళుతున్న కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సతీష్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా చనిపోయాడని తండ్రి నాగరాజు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా నాగరాజుకు ఒక కుమారుడు, కుమార్తె. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.