
హెల్మెట్ లేకుంటే లైసెన్స్ సస్పెన్షన్
● ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం ● జిల్లాలో ద్విచక్ర వాహనాల తనిఖీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం ఆదేశాల మేరకు జిల్లా రవాణా శాఖ అధికారులు ఏలూరు నగరంతో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు ప్రాంతాల్లో సోమవారం ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 61 ద్విచక్ర వాహన చోదకులపై కేసులు నమోదు చేసి రూ.1,56,000 అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా కరీమ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని తెలిపారు. మోటార్ సైకిల్ లేదా స్కూటర్లను నడిపే వాహన చోదకులు హెల్మెట్ ధరించని పక్షంలో జరిమానా విధించడంతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రహదారి ప్రమాదాల్లో ద్విచక్ర వాహన చోదకులే అధిక శాతం మర ణిస్తున్నారని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణనష్టం జరుగకుండా నివారించవచ్చన్నారు. రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించిన నాడే మరణాలను తగ్గించగలుగుతామన్నారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో ఎంవీఐ శేఖర్, ఏఎంవీఐలు స్వామి, నరేంద్ర, సురేష్ బాబు, జమీర్, కళ్యాణి, కృష్ణవేణి, అన్నపూర్ణ, జగదీష్ పాల్గొన్నారు.