
రైతులకు అభయం.. సమస్యలపై సమరం
● ప్రధానంగా వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలవాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారని బొత్స తెలిపారు. ధాన్యం కల్లాల్లో ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయంపై ఈ సందర్భంగా చర్చించారు. ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి పొంతనే లేదని నేతలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో రైతుల ఇబ్బందులు తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించి, వారితో మాట్లాడి, అండగా నిలవాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
● ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని నిర్ధారించారు. రొయ్యల ధరలు పడిపోవడం, మేత ధరలు అడ్డగోలుగా పెరిగిపోయి రైతులు నష్టపోతున్నా సర్కార్‌కు చీమ కుట్టినట్టయినా లేదని, ఆక్వా రైతులకు వెన్నంటి నిలవాలని తీర్మానించారు.
● గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాదిరిగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పొగాకు రైతులకు అండగా నిలిచి, పోరాడటానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు.
● ప్రధానమైన ప్రజాసమస్యలపై పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సైతం సిద్ధంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ వివరించారు.
● సూపర్ సిక్స్ సహా కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ప్రభుత్వంపై ప్రజాపోరులో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే లా బాధ్యత తీసుకోవడానికి నాయకులు ముందుకు వచ్చారు.
● క్షేత్రస్థాయిలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలకు అండగా నిలిచి, మనోధైర్యం కల్పించాలని సమావేశంలో తీర్మానించారు.