
నూరు శాతం లక్ష్యాలు సాధించాలి
జంగారెడ్డిగూడెం: ప్రభుత్వ రెవెన్యూ లక్ష్యాలను సాధించడంలో అలసత్వం వహించినా, చర్యలు తప్పవని జిల్లా ఉప రవాణా కమిషనరు షేక్ కరీం, జిల్లా రవాణా జిల్లా వాహన తనిఖీ అధికారులను హెచ్చరించారు. బుధవారం జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. కేసులున్న వాహన యజమానుల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో ఆర్టీవోలు పాల్గొన్నారు.
ఆస్థాన విద్వాంసుడిగా కేవీ సత్యనారాయణ
ద్వారకాతిరుమల : శ్రీవారి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా తనను ప్రకటించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు ఏలూరుకు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, సినీ నృత్య దర్శకుడు, నాట్య కళా విశారద కేవీ సత్యనారాయణ అన్నారు. ఎన్నో ఏళ్లుగా తన నాట్యం ద్వారా శ్రీవారిని సేవిస్తున్నట్టు చెప్పారు.
నేడు కోకో రైతుల మహాధర్నా
దెందులూరు : కోకో రైతులను అవమానపర్చడాన్ని నిరసిస్తూ గురువారం సోమవరప్పాడు జాతీయ రహదారి వద్ద కోకో రైతుల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు కే.శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఉదయం కోకో రైతులకు మద్దతుగా అన్ని విభాగాల రైతులు మహాధర్నాలో పాల్గొని రైతులకు సంఘీభావాన్ని తెలియజేయాలని కోరారు. గింజలు కొనుగోలు చేయకుండా కంపెనీ ప్రతినిధులు రైతులను అవమానపరచడం క్షమించరాని విషయమన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 7,373 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి మొత్తం 7373 మంది హాజరయ్యారు. ఉదయం ప్రథమ సంవత్సరం మ్యాథ్స్/బోటనీ/సివిక్స్ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 6275 మందికి గాను 5983 మంది హాజరు కాగా, 408 మంది ఒకేషనల్ విద్యార్థులకు 367 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం 895 మంది జనరల్ విద్యార్థులకు 834 మంది హాజరు కాగా 211 మంది ఒకేషనల్ విద్యార్థులకు 189 మంది హాజరయ్యారు.
కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు ఆహ్వానం
దెందులూరు: గోపన్నపాలెంలోని కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతి సైన్స్ గ్రూపులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ బూర్ సింగ్ మీనా అన్నారు. బుధవారం కేంద్రీయ విద్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 24 లోగా విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలు కార్యాలయంలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
రామశింగవరంలో భూకేటాయింపు నిలిపివేత
సాక్షి, అమరావతి: ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం రామశింగవరంలో ఏపీఐఐసీకి 173.60 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2017లో జారీ చేసిన జీఓను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ భూమి అటవీ శాఖ నియంత్రణలోని పంచాయతీ అటవీ భూమిగా గుర్తించిన నేపథ్యంలో అటవీ (సంరక్షణ) చట్టం, 1980 ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు కేటాయింపును నిలిపివేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. జిల్లా కలెక్టర్ నివేదిక ప్రకారం 2017లోనే ఏపీఐఐసీకి భూమి అప్పగించినా అటవీ శాఖ దాన్ని తమ ఆధీనంలో ఉన్నట్లు తెలిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి ‘గయాలు’గా నమోదై ఉండగా, అటవీ శాఖ దీన్ని 1993లో తమకు రిజర్వ్ భూములుగా ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఈ భూమిలో ఏపీఐఐసీ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా, అటవీ చట్టం కింద అనుమతులు పొందేవరకూ ఆగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నూరు శాతం లక్ష్యాలు సాధించాలి