
ట్రిపుల్ ఐటీలో ఉత్తరం కలకలం
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆకాశ రామన్న ఉత్తరంతో కలకలం రేగింది. కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ, మెంటార్‌లందరికి ఈ ఉత్తరం శనివారం పోస్టులో వచ్చింది. యూనివర్సిటీ యాజమాన్యం కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ పట్ల ఒక విధంగా వ్యవహరిస్తూ , పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా దోచిపెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. తాము జీతాలు పెంచమని, గతంలో నెట్, సెట్ లేకుండా పీహెచ్‌డీకి ఇచ్చిన ఇంక్రిమెంట్‌లను ఇవ్వమని అడిగితే నిబంధనలంటూ అడ్డుపడుతున్న యాజమాన్యం, పర్మినెంట్ అధ్యాపకులకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ తేదీలను మూడేళ్లు ముందుకు జరుపుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వమని అడిగితే జీవో నెంబరు 110ని బూచిగా చూపిస్తున్నారని, అదే శాశ్వత అధ్యాపకులకు మాత్రం జీవో నెంబరు 14, జీవో నెంబరు 20లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పెయిడ్ జర్నల్స్, కాన్ఫరెన్స్ పేపర్లను చూపించి పదోన్నతుల తేదీలు జరిపించుకుంటున్నట్లు లేఖలో వివరించారు. ఇలా పలు ఆరోపణలు చేశారు. లోతైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అర్జీయూకేటీ కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఉన్నవన్నీ సత్యాలేనని, పీహెచ్‌డీ చేసిన మెంటార్లు, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.5 వేలు అదనపు ఇంక్రిమెంట్ కొన్నాళ్లు ఇచ్చి జీవో నెంబరు 110ను సాకుగా చూపించి ఆపేశారని, దీనివల్ల ఎంతో నష్టపోయామని వాపోతున్నారు.