
మొగల్తూరు మామిడి.. తడబడి
నరసాపురం: మొగల్తూరు మామిడి ప్రాభవం కోల్పోతుంది. ఏటేటా తీర ప్రాంతంలో మామిడి తోటల విస్తీర్ణం తగ్గుతోంది. పట్టణీకరణతో తోటలు నరికివేయడం, తెగుళ్లు కారణాలుగా ఉన్నాయి. ప్రస్తుతం మొగల్తూరు, పేరుపాలెం పరిసర ప్రాంతాల్లో సుమారు 1,800 ఎకరాల్లో మాత్రమే తోటలు ఉన్నాయి. చెరుకు రసం, చిన్న రసాలు, పెద్ద రసాలు, కొత్తపల్లి కొబ్బరి రకాలు ప్రత్యేకం. ముఖ్యంగా మొగల్తూరు బంగినపల్లికి మంచి పేరుంది. సువర్ణరేఖ, కలెక్టర్, హైజర్లు రకాలు పచ్చళ్లకు ప్రసిద్ధి. జిల్లాతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ రకాలను కొనుగోలు చేస్తుంటారు.
తెగుళ్లతో సతమతం
మామిడి చెట్లకు మచ్చతెగులు, మంచు తెగుళ్లు సోకుతున్నాయి. రియల్ ఎస్టేట్ పెరగడంతో తోటలు నరికివేస్తున్నారు. దీంతో ఒకప్పుడు 5 వేల ఎకరాల్లో ఉన్న తోటలు నేడు 1,800 ఎకరాలకు పరిమితమయ్యాయి. అలాగే ఈ ప్రాంతంలో ఇంటి పెరట్లలోనూ మామిడి చెట్లు ఉన్నాయి. ఏటా గాలి దుమారంతో పిందెలు, కాయలు రాలిపోవడంతో కాపు తగ్గుతోంది.
వేసవికి ముందే..
మొగల్తూరు మామిడి వ్యాపారం వేసవి సీజన్‌కు ముందే ప్రారంభమవుతుంది. శీతాకాలంలో పిందె దశలోనే రైతులు తోటల్లో పంటను విక్రయిస్తుంటారు. ఒక్కో చెట్టూ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ విక్రయిస్తుంటారు.
ఆలస్యం.. వీటి ప్రత్యేకం
మొగల్తూరు మామిడి పండ్లు ఆలస్యంగా కాపునకు వస్తాయి. మే రెండో వారం నుంచి జూన్, జూలై నెలల్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే మామిడి పండ్లు మా ర్కెట్‌కు వస్తునాయి. ప్రస్తుతం మొగల్తూరు మా మిడి పండ్లు పరక రూ.250 ధర పలుకుతోంది. బంగినపల్లి రకం డిమాండ్‌ను బట్టి కాయ ఒకటి రూ.40 నుంచి రూ.80కు విక్రయిస్తున్నాయి.