
7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు మైలవరంలోని ఆయన చాంబర్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈనెల 7 నుంచి 14 వరకు జరిగే ఉత్సవాల విశేషాలను ఆయన వెల్లడించారు. 7న ఉదయం శ్రీవారిని పెండ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేయడం, 8న అంకురార్పణ, రుత్విగ్వరణ, ధ్వజారోహణ, 9న సూర్యప్రభ, చంద్ర ప్రభ వాహనాలపై తిరువీధి సేవలు, 10న రాత్రి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుందన్నారు. 11న రాత్రి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, 12న రాత్రి రథోత్సవం, 13న చక్రవారి–అపభృధోత్సవం, వేద సభ, ధ్వజావరోహణ వేడుకలు నిర్వహిస్తామన్నారు. 14న చూర్ణోత్సవం, వసంతోత్సవం, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగం–పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారని చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 7 నుంచి 14 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు, డీఈఓ బాబూరావు, ఏఈఓ పి.నటరాజారావు పాల్గొన్నారు.