
హైస్కూల్ గ్రౌండ్‌లో మద్యం సేవించిన ఇద్దరిపై కేసు
ద్వారకాతిరుమల: స్థానిక శ్రీవారి దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాల గ్రౌండ్‌లో ఈనెల 28న మద్యం సేవించి, వివాదానికి కారణమైన ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులపై స్థానిక పోలీస్టేషన్‌లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. వివరాల ప్రకారం. దేవస్థానంలో పారిశుద్ధ్య పనులకు వినియోగించే ట్రాక్టర్‌ను నడిపే డ్రైవర్ కందికొండ భూషణం, స్కావెంజర్ కొండాబత్తుల సూరిబాబు ఈనెల 28న మధ్యాహ్నం హైస్కూల్ గ్రౌండ్‌లోని స్టేజీపై కూర్చుని మద్యం సేవించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా వివాదంగా మారింది. దీనిపై ఆలయ అధికారులు స్పందించారు. ఈ క్రమంలో దేవస్థానం సెక్యూరిటీ సూపర్‌వైజర్ ప్రవీణ్ కుమార్ మంగళవారం స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన భూషణం, సూరిబాబు లపై పోలీసులు పెట్టీ కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
నూజివీడు: మండలంలోని బత్తులవారిగూడెం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు మండలం పాతముప్పర్రుకు చెందిన రంజుల ఏసుబాబు (34) మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై మైలవరం వెళ్తుండగా బత్తులవారిగూడెం శివారులో వెనక నుంచి బొలేరో వాహనం వచ్చి ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన ఏసుబాబును పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి 8 గంటల సమయంలో మృతిచెందాడు. రూరల్ ఎస్సై జ్యోతీబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు బుధవారం అప్పగించారు.
నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
ఏలూరు రూరల్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నట్లు డీఎస్‌డీఓ బి శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిబిరాల్లో ఈనెల 31వ తేదీ వరకూ 8 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు శిక్షణ అందించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 50 శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అథ్లెటిక్స్, అర్చరీ, బాస్కెట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, చెస్, ఫుట్‌బాల్, హేండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, రోయింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, కయాకింగ్, స్కేటింగ్ వంటి విభాగాల్లో జిల్లాలో ఎంపిక చేసిన శిబిరాల్లో తర్ఫీదు ఇస్తామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉత్తమ ప్రీమియం బిజినెస్ హోటల్‌గా అంబికా ఎంపైర్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరానికి చెందిన అంబికా సంస్థల ఆధ్వర్యంలో చైన్నెలో నిర్వహిస్తున్న అంబికా ఎంపైర్ హోటల్‌కు 2025వ సంవత్సరపు ఉత్తమ ప్రీమియం బిజినెస్ హోటల్ (4 స్టార్ సౌకర్యాలతో) అవార్డు లభించింది. ఈ అవార్డును ఇటీవల చైన్నెలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మాజీ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ చేతుల మీదుగా అంబికా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంబికా రాజా అందుకున్నారు. చైన్నెలోని తమ అంబికా ఎంపైర్ హోటల్ అత్యున్నత స్థాయి సేవ, నాణ్యత, ఆతిథ్యాన్ని అందిస్తూ వినియోగదారుల మన్ననలను పొందినట్లు రాజా తెలిపారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో అంబికా గ్రూప్ ఆప్ హోటల్స్ జనరల్ మేనేజర్ ఆర్. కళాతినాథన్, మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ కృష్ణకుమార్, అంబికా ఎంపైర్ హోటల్ అడ్మిన్ మేనేజర్ పుష్పలత, న్యాయమూర్తులు ఎస్‌కే కృష్ణన్, కే వెంకటేశన్ తదితరులు పాల్గొన్నారని చెప్పారు.

హైస్కూల్ గ్రౌండ్‌లో మద్యం సేవించిన ఇద్దరిపై కేసు