సాక్షి ప్రతినిధి, ఏలూరు: కై కలూరులో కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. సైకిల్, కమలం నేతగా పేరున్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ టీడీపీ, జనసేనను సమన్వయం చేసుకుని సర్దుబాటు చేసుకోవడంలో విఫలమవుతుండటంతో సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. తాజాగా షాపు విషయమై టీడీపీ, జనసేన నేతల మధ్య వివాదం తలెత్తి తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఇరు పార్టీల నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం నియోజకవర్గంలో హాట్‌టాఫిక్‌గా మారింది. కై కలూరు ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు 2014, 2024లో టిక్కెట్ దక్కించుకుని టీడీపీ, జనసేన ఓట్లతో ఎమ్మెల్యే అయ్యిఆరు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తనకు సన్నిహితంగా ఉండే నలుగురు టీడీపీ నేతలను రింగ్ లీడర్లుగా ఏర్పాటు చేసి చిన్నపాటి వివాదాల నుంచి భారీ పైరవీల వరకు అన్ని వారి కనుసన్నల్లోనే జరిగేలా చూస్తుంటారు. ఐదేళ్ల పాటు సొంత పార్టీ బీజేపీ నేతలు, మిగిలినవారిని పట్టించుకోని పరిస్ధితి. కామినేని ప్రాబల్యంతో టీడీపీ, జనసేనకు నియోజకవర్గ ఇన్‌చార్జుల్ని నియమించలేని పరిస్ధితి. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా టీడీపీ, జనసేన కోసం పనిచేసిన వారిని పట్టించుకోకపోగా ఏం జరిగినా సంబంధం లేదన్న రీతిలో ఎమ్మెల్యే వ్యవహరిస్తుండటంతో నియోజకవర్గంలో కూటమి నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
టీడీపీ వర్సెస్ జనసేన
టీడీపీ రాష్ట్ర ఆర్యవైశ్య డెవలప్‌మెంట్ వెల్ఫేర్ కార్పొ రేషన్ డైరెక్టర్ పైడిమర్రి జయశ్యామల మాల్యాద్రి కై కలూరులో తన కార్యాలయంలో ఉండగా గత శనివారం రాత్రి దాదాపు 30 మంది జనసేన కార్యకర్తలు వచ్చి ఘర్షణకు దిగి దౌర్జన్యం చేశారు. గాంధీబొమ్మ సెంటర్‌లో సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు వల్ల ప్రభుత్వ భూమిలో ఉన్న జనసేన కార్యకర్త బడ్డికొట్టు పోతుందని, ఇందుకు కారణం మాల్యాద్రి అని జనసేన ఆరోపణ. తమ బడ్డికొట్టుపై రాళ్ళు వేశారని జనసేన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే గొడవ చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా కై కలూరు టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ కేసులను పోలీసులు హోల్డ్‌లో ఉంచారు. నియోజకవర్గంలో అక్రమ మట్టి దందా సాగుతుందని పదుల సంఖ్యలో వాహనాలు వెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, అక్రమ రవాణా చేసే టిప్పర్లను సీజ్ చేయాలనే డిమాండ్‌తో టీడీపీ నేత వీరాబత్తుల సుధ కొద్ది రోజుల క్రితం సీఐ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేసిన కంచర్ల రామకృష్ణ పదవుల్లో టీడీపీ శ్రేణులకు అన్యాయం జరుగుతుందని పోస్టు పెట్టినందుకు టీడీపీ మండల అధ్యక్షుడు త్రినాథరావు ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల పెద్దింట్లమ్మ జాతరలో టీడీపీ నేతలకు ఆహ్వానం, ప్రాధాన్యం లేదని ఈఓ తీరుపై మండిపడి ఫిర్యాదులు చేశారు. ఇలా వరుసగా అనేక ఘటనలు జరుగుతున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోని పరిస్థితి.
షాడోలదే హవా
నాలుగు మండలాల్లో కామినేని ప్రతినిధులుగా నలుగురు టీడీపీ నేతలు హవా సాగిస్తున్నారు. టీడీపీ కేడర్‌కు గాని, మండల స్థాయి నేతలు కనీసం పట్టించుకోకపోగా చిన్నపాటి సిఫార్సును కూడా లైట్‌గా తీసుకోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎన్నికల సమయంలో వలస వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస ప్రాధాన్యం లేదు.
నామినేటేడ్ పదవుల చిచ్చు:
నియోజకవర్గంలో మూడు పార్టీల నాయకులకు నామినేటెడ్ పదువుల పందేరం పెద్ద తలనొప్పిగా మారింది. వీటిలో కై కలూరు, కలిదిండి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ల పదవులు కీలకం. కలిదిండి మార్కెట్ యార్డు చైర్మన్‌గా జనసేన నాయకుడు చలపతి, అండ్రాజు శ్రీను, లంక రత్నారావు, పంతగాని సురేష్‌లు ఆశించారు. చివరకు టీడీపీ మండలాధ్యక్షుడు జోగిరాజు పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. జనసేన నాయకుడు చలపతి ధిక్కార స్వరం వినిపించారు. జనసేన నేతలతో ఫోన్లు చేయించారు. కై కలూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కోసం టీడీపీ మండలాధ్యక్షుడు పెన్మత్స త్రినాథరాజు, గంగుల శ్రీదేవి, పూల రాజీ ఆశించారు. పూలా రాజీ భార్యకు కేటాయిస్తారని సమాచారం. ఇక్కడ కూడా ఆశావాహుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
టీడీపీ, జనసేన మధ్య తారాస్థాయికి విభేదాలు
పోలీసు స్టేషన్‌లో ఇరు పార్టీల నేతలు ఫిర్యాదు
ఎమ్మెల్యే కామినేని తీరుపై టీడీపీ, జనసేన నేతల అసంతృప్తి
టీడీపీ అధిష్టానానికి పార్టీ శ్రేణుల ఫిర్యాదు