జంగారెడ్డిగూడెం: శాంతి భద్రతల పరిరక్షణకు సాంకేతికతను వినియోగిస్తున్నామని ఎస్పీ కేపీఎస్ కిషోర్ అన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, కేసుల తీరు, శాంతిభద్రల కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్‌ను పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు.
ఇమామ్, మౌజన్‌లు ధ్రువపత్రాలు సమర్పించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని మసీదుల్లో ఇమామత్ నిర్వహిస్తూ ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందుకుంటున్న ఇమామ్‌లు, మౌజన్‌లు, వారితో పాటు ప్రస్తుతం ఉన్న ముతవల్లి లేదా మసీదు అధ్యక్షులు వారి ఆధార్ జిరాక్స్ కాపీలు 2, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు 2, మసీదు పేరుపై ఉన్న బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలు తమ కార్యాలయంలో సమర్పించాలని జిల్లా వక్ఫ్‌బోర్డ్ ఇన్స్‌పెక్టర్ కేఎండీ అలీం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్యుమెంట్లను జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గోపి
ఏలూరు (టూటౌన్): జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా లక్కోజు రాజగోపాలాచారిని(గోపి) నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు యాదవ్ నియామక పత్రాన్ని గోపికి అందజేశారు. స్థానిక పవర్ పేట వడ్రంగి సంక్షేమ సంఘం భవనంలో శనివారం జరిగిన జిల్లా బీసీ సంఘ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా రాజగోపాలాచారిని, మహిళా కార్యదర్శిగా బాలిన ధనలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శిగా చిదరబోయిన శ్రీనివాస్ యాదవ్, నగర యూత్ అధ్యక్షుడిగా జరజాపు రాఘవ, యూత్ కార్యదర్శిగా ఇదలాడ నాని, బంకురి వెంకట్, బీసీ మహిళ అధ్యక్షురాలిగా మోతిక రాఘవమ్మ, జిల్లా కమిటీ సభ్యులుగా బాయి వెంకట్రావు, కింజంగి రాజు, కొత్తల శివ, కెల్ల దుర్గాప్రసాద్, చిట్టు మోజు రత్నబాబు, కొండల ప్రసాద్ తదితరులను నాయకులును నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు.
దూరవిద్య పరీక్షకు 49 మంది గైర్హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూర విద్య విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో శనివారం నిర్వహించిన పరీక్షలకు 49 మంది గైర్హాజరయ్యారు. జీవశాస్త్రం పరీక్షకు 121 మందికి 99 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారు. వ్యాపార శాస్త్రం పరీక్షకు 295 మందికి గాను 264 మంది హాజరయ్యారు. పరీక్షలను జిల్లా విద్యాశాఖాధికారి రెండు కేంద్రాల్లో, డీఈసీ కమిటీ రెండు కేంద్రాల్లో, ఫ్లయింగ్ స్క్వాడ్ మరో రెండు కేంద్రాల్లో తనిఖీ చేశారు.
ఇంటర్ పరీక్షలకు 12,930 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం నిర్వహించిన కెమిస్ట్రీ –2, కామర్స్–2 పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాల్లో మొత్తం 13,390 మంది విద్యార్థులకు గాను 12,930 మంది హాజరయ్యారు. 12,238 మంది జనరల్ విద్యార్థులకు 11,992 మంది హాజరు కాగా 1,152 మంది ఒకేషనల్ విద్యార్థులకు 938 మంది హాజరయ్యారు. శనివారంతో ఇంటర్ ప్రధాన పరీక్షలు ముగిశాయి. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాన్ తెలిపారు. ఈ నెల 17 నుంచి ఇంగ్లీష్, తెలుగు, గణితం, హిందీ, సివిక్స్ సబ్జెక్టులకు మూల్యాంకనం ఏలూరులోని కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతాయని తెలిపారు.