భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని కర్మాగారాలలో విపత్తులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలపై ఈ నెల 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కమాండెంటు ఆదిత్య కుమార్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టరు ఆర్ కుర్మనాథ్ వెబ్‌ఎక్స్ ద్వారా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తణుకు వెంకటరాయపురం ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్, పాలకొడేరులోని ఆనంద ఎంటర్ ప్రైజెస్ పరిశ్రమల్లో ఈ నెల 7వ తేదీన మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మాక్‌డ్రిల్‌లో దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే బాధితులకు సత్వర చికిత్స అందించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉభయ పశ్చిమగోదావరి జిల్లాల కర్మాగారాల ఇన్‌స్పెక్టర్ త్రినాథ్, జిల్లా అగ్నిమాపక అధికారి బి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి యు.మంగపతిరావు పాల్గొన్నారు.