ఏలూరు (మెట్రో): జిల్లాలోని పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్ నిర్వహించాలని జేసీ బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహణపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సోమవారం జేసీ సమీక్షించారు. రాష్ట్రంలోని పలు పరిశ్రమలలో జరిగిన ప్రమాదాల్లో పరిశ్రమలోనే కాక పరిసర ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించాయన్నారు. జిల్లాలో అటువంటి పరిస్థితి ఎదురుకాకుండా పరిశ్రమల సిబ్బందిని విపత్తును ఎదుర్కొనేలా సిద్ధం చేయడానికి మాక్ డ్రిల్స్ ఉపయోగపడతాయన్నారు. దీని వల్ల ముఖ్యంగా రసాయనిక పరిశ్రమలలో ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కలుగుతుందన్నారు. ప్రమాద తీవ్రతను తగ్గించడం, క్షతగాత్రులకు చికిత్స, పరిసర ప్రాంతాల ప్రజలను తరలించడం, కాలుష్యాల నివారణ, తదితర అంశాలపై మాక్ డ్రిల్ఙ్‌లో తెలియజేయడం జరుగుతుందన్నారు. ఉంగుటూరు మండలంలోని జాన్సన్ టైల్స్ పరిశ్రమలో ఈనెల 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని, దీనిలో అధికారులు అందరూ పాల్గొనాలని జేసీ ఆదేశించారు. ఇన్‌స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ ఎ.శ్రీనివాసరావు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ త్రినాథరావు, కాలుష్య నియంత్ర ణ మండలి ఈఈ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.