
వేద పండితులను సత్కరిస్తున్న జాయింట్ కలెక్టర్ పి.అరుణ్‌బాబు
ఏలూరు(మెట్రో) : జిల్లా ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆకాక్షించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజలందరికి శ్రీ శోభకృత్ నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగు ఉగాది వేడుకలను జాయింట్ కలెక్టర్ పి.అరుణ్‌బాబు ప్రారంభించారు. అనంతరం బ్రహ్మశ్రీ కిళంబి మారుతీ, యనమండ్ర రవిప్రకాష్ వేదపఠనం చేశారు. ఈ సందర్భంగా జేసీ అరుణ్ బాబు మాట్లాడుతూ ఈ ఏడాది ఉద్యోగ, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి మంచి స్ధానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అందరూ ఆనందంగా జీవించాలని, అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నానన్నారు. ఏ స్ధాయిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా జన్మభూమి, సంస్కృతిని గొప్పగా చెప్పుకోవాలన్నారు. ఉగాది పచ్చడిలో ఉన్న సారాంశం ప్రకారం జీవితంలోని తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం, వంటివి మన జీవితంలో సమపాళ్లలో స్వీకరించాలన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులంతా మరింత సమర్ధవంతంగా పనిచేసి జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదపడాలన్నారు. విద్యార్థులందరూ చక్కగా చదువుకొని విజయాలందుకుని తమ తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు పేట శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు కిళంబి మారుతి పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ కిళంబి మారుతి, యనమండ్ర రవిప్రకాష్, యడవల్లి శ్రీనివాసరావులను సత్కరించారు. దేవదాయశాఖ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, జిల్లా రెవిన్యూ అధికారి ఎవీఎన్‌ఎస్ మూర్తి, ట్రైనీ కలెక్టర్ అపూర్వ భరత్, ఏలూరు ఆర్డిఓ కె.పెంచలకిషోర్‌లను శాలువలతో సత్కరించారు. ఆర్‌టీసీ పీఆర్‌వో నరసింహం వ్యాఖ్యాతగా వ్యవహరించారు.