
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందించిన గారపాటి చౌదరి
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా వ్యాప్తంగా తపన ఫౌండేషన్ ద్వారా మరింత విస్తృతమైన సేవలు అందిస్తామని సంస్థ చైర్మన్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం, ఉగాది వేడుకల సందర్భంగా సత్రంపాడు సమీపంలోని పద్మావతి కన్వెన్షన్ సెంటర్లో బుధవారం సాయంత్రం ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందించారు. తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రేణుక దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. గారపాటి చౌదరి నిర్వహించిన సేవా కార్యక్రమాలను తెలిపే విధంగా సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ రాసిన పాటను ఆవిష్కరించారు. అనంతరం గారపాటి చౌదరి మాట్లాడుతూ సరిగ్గా 15 ఏళ్ల క్రితం సమాజానికి ఏదో సేవ చేయాలనే తపనతో ఈ తపన ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అందించిన సేవలను వివరించారు. ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన పలువురు విద్యార్థులు వేదికపై మాట్లాడారు. అనంతరం వ్యక్తిగతంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు తపన ఫౌండేషన్ ఉగాది సేవల పురస్కారాలను గారపాటి చౌదరి, రేణుక దంపతులు తమ చేతులు మీదుగా అందించారు. పురస్కారాలు అందుకున్న వారిలో జంగారెడ్డిగూడెంకు చెందిన కొండపల్లి పండు, కన్నాపురానికి చెందిన కట్టా లక్ష్మి, ఏలూరుకు చెందిన అల్లం వెంకట సుబ్బారావు, కామవరపుకోటకు చెందిన వీరమల్లు మధుసూదనరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, బుల్లితెర సీనియర్ నటి హరిత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఆధ్యాత్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.