
అమర్ జవాన్ స్మారక చిహ్నం ఆవిష్కరించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ఏలూరు(మెట్రో)/ఏలూరు టౌన్: మాజీ సైనికోద్యోగులు సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక కోటదిబ్బలోని జిల్లా మాజీ సైనికోద్యోగుల అసోసియేషన్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన అమర్ జవాన్ స్మారక చిహ్నాన్ని (ఐకాన్) కలెక్టర్ ఆవిష్కరించారు. తొలుత అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. వీరితో పాటు లెఫ్ట్‌నెంట్ జనరల్ కేఆర్ రావు, లెఫ్ట్‌నెంట్ జనరల్ కేజీ కృష్ణ, ఉండవల్లి లత అమర జవానుల స్మారక చిహ్నానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తనకు ఎన్‌సీసీలో హవల్దార్ సత్యరాజన్ శిక్షణ అందించారన్నారు. అనంతరం సివిల్ సర్వీస్‌కు ఎంపికై నట్లు తెలిపారు. ఐఏఎస్ శిక్షణ సమయంలో ఆర్మీకి సంబంధించిన శిక్షణను సిక్కిం బోర్డర్‌లో 15 రోజుల పాటు తీసుకున్నానని, అప్పుడే తాను సైనికుల బాధలు, కష్టాలు చూశానన్నారు. ఆ సమయంలో హవల్దార్ సత్యరాజన్ తమను గుర్తించి మాట్లాడటం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. మాజీ సైనికోద్యోగుల అసోసియేషన్‌కు కంప్యూటర్, ప్రింటర్, ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కావాలని తనను కోరారన్నారు. త్వరలో వీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. మాజీ సైనికోద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కలెక్టర్ స్పష్టం చేశారు. లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు, కేజీ కృష్ణ, ఉండవల్లి లత మాట్లాడారు. అసోసియేషన్ చైర్మన్ వాసుకి శర్మ మాట్లాడుతూ సైనికులు విధి నిర్వహణలో, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారన్నారు. అమర జవాన్ల సేవలకు గుర్తుగా ఇక్కడ చిహ్నం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.సుబ్బారావు, జనరల్ సెక్రెటరీ పీబీ రమేష్, డీఎస్పీ పైడేశ్వరారావు, తహసీల్దార్ బి.సోమశేఖర్ పాల్గొన్నారు.
కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్
కోటదిబ్బలో అమర జవాన్ల స్మారక చిహ్నం ఆవిష్కరణ