
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాం కార్యాలయం వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంస్థ పాలకవర్గ ఎన్నికలు ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం పూర్తయి ఎనిమిది నెలలు కావస్తున్నా ఎన్నికల ఊసు ఎత్తకపోవడంతో అంజుమన్ సంస్థకు సంబంధించిన కొంతమంది శాశ్వత సభ్యులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వార్డుల వారీ ఎన్నిక ద్వారా 35 మంది సభ్యులను సంస్థ సభ్యులు ఎన్నుకుంటారు. వీరంతా కలిసి సంస్థ అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటారు. అయితే గత పాలకవర్గం గడువు దాటి ఏడాది అయినా ఎన్నికలు నిర్వహించలేదు. అప్పట్లో కూడా ఇదే తరహాలో సభ్యులు ఆందోళన చేయడంతో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో పాత పాలకవర్గమే గెలిచిందని, కోర్టుకు వెళ్ళి తమకే పూర్తి మెజారిటీ ఉందని నిరూపించుకున్నారు.పాత పాలకవర్గం చూపిన దారిలోనే ప్రస్తుత కార్యవర్గం వెళుతూ ఎన్నికలపై ఎటువంటి ప్రకటనా చేయకపోవడంతో వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగింది. ఈ నేపధ్యంలో ఆందోళన నిర్వహిస్తున్న వారితో ప్రస్తుత పాలకవర్గ సభ్యులు చర్చలు ప్రారంభించారు.