
శ్రీవారి ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతాన్ని సుందరీకరిస్తున్న సిబ్బంది
నేడు సాయంత్రం ఉగాది ఉత్సవం
ద్వారకాతిరుమల: ఉగాది వేడుకలకు చినవెంకన్న క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నూతన తెలుగు సంవత్సరాది ఉత్సవాలను శ్రీవారి దేవస్థానం అత్యంత వైభంగా నిర్వహించనుంది. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయాన్ని మామిడి తోర ణాలు, అరటిబోదెలు, పచ్చిపూలతో శోభాయమానంగా అలంకరించారు. క్షేత్రంలోని ఉగాది మండపాన్ని, పరిసరాలను సుందరీకరించారు. మండప ప్రాంతంలో విద్యుద్దీపాలంకారాలు మిరమిట్లు గొలుపుతున్నాయి. శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయంలో వెండి శేష వాహనంపై ఉంచి, ఊరేగింపుగా ఉగాది మండపం వద్దకు తీసుకువెళ్తారు. అక్కడ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనంపై ఉభయ దేవేరులతో శ్రీవారిని వేంచేపు చేసి, ప్రత్యేక పూజలు జరుపుతారు. అనంతరం అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత పండిత సత్కార కార్యక్రమం జరగనుంది. ఈ ఉగాది వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించి, తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు కోరారు.