
‘కుండపోతలతో వస్తున్నాం... కాచుకోండ’న్నట్టు హెచ్చరిస్తూ ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు. సోమవారం వేకువజామునే కళ్లు తెరిచిన ముంబై మహానగరవాసులు... వస్తూనే తడాఖా చూపించిన భారీ వర్షాన్ని చూసి బిత్తరపోయారు. సాధారణ సమయాల్లో గంభీరంగా, కళ్లు చెదిరేలా కనబడే మన నగరాలు చినుకు రాలితే ఎంత అల్లకల్లోలమవుతాయో మొన్నీ మధ్యే బెంగళూరు నగరం కూడా నిరూపించింది. మన్నూ మిన్నూ ఏకమైనట్టు ధారాపాతంగా రాత్రంతా కురియటంవల్ల 200 మిల్లీ మీటర్లు(ఎంఎం) మించిన వర్షపాతంతో ముంబై నగరం తాజాగా తడిసిముద్దయింది.
ఆ నగరానికి ముందుగా జారీచేసిన ‘యెల్లో అలెర్ట్’ను కాస్తా ‘రెడ్ అలెర్ట్’గా సవరిస్తూ, ముంబైతోపాటు దాని ఇరుగుపొరుగునున్న జిల్లాల్లో సైతం పిడుగులతో, పెనుగాలులతో అత్యంత భారీ వర్షం ముంచుకు రాబోతున్నదని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ముంబై పొరుగునున్న కొలాబాలో సోమవారం 295 ఎంఎం వర్షపాతం నమోదై, 107 ఏళ్లనాటి... అంటే 1918 నాటి రికార్డు 279.4 ఎంఎంను అధిగమించింది. ఇంకా కర్ణాటకలోని మంగళూరు నగరం, దక్షిణ కన్నడ జిల్లాలు సైతం భారీవర్షాలతో ఇక్కట్లుపడ్డాయి. కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు పది రోజులకు మహారాష్ట్ర రావాల్సివుండగా కేవలం 24 గంటల్లో అక్కడికి లంఘించాయి. ముంబైకి ఆ మర్నాడే చెప్పాపెట్టకుండా వచ్చాయి.
సరిగ్గా అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్స్ విభాగం ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ప్రతియేటా అంతక్రితంతో పోలిస్తే భారీ వర్షాలు నమోదవుతున్నాయన్నదే దాని సారాంశం. ఇలాంటి ప్రకటనలు మన పాలకుల్ని అప్రమత్తుల్ని చేయాలి. ఏటా నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి. వాటి వికేంద్రీకరణకు ప్రణాళికలు రూపొందించాలి. కానీ తరచు నడుంలోతు నీళ్లల్లో మునకలేస్తున్న నగరాలను చూస్తుంటే వారికంత శ్రద్ధ, తీరిక లేవన్న సంగతి తెలుస్తుంది.
శతాబ్దం కిందట లేదా అంతకు చాలాముందు నుంచీ ప్రధాన నగరాలుగా వున్నవాటిపై ఎటూ శ్రద్ధ లేదు. కనీసం కొత్తగా నిర్మిస్తున్న నగరాలపైన అయినా ముందుచూపుతో వ్యవహరిద్దామన్న జ్ఞానం లేదు. నిరుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకూ దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు విజయవాడ నగరంలో కొంత భాగాన్ని ముంచెత్తడంతోపాటు అమరావతిని కూడా వరదలు అస్తవ్యస్తం చేశాయి. దాని పరిధిలోని 29 గ్రామాల్లో 25 నిండా నీళ్లల్లో మునిగాయి. సాక్షాత్తూ సీఎం చంద్రబాబే అక్రమంగా వుంటున్న తన కరకట్ట నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ తదితర సంస్థలు మూతపడాల్సి వచ్చింది. లక్షలాదిమంది ప్రజలు సకాలంలో సాయం అందక ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో 35 మంది మరణించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ చెప్పినా మొండి వైఖరితో అమరావతికి పూనుకోవటమే తప్పనుకుంటే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని మళ్లీ పిలిచి అట్టహాసంగా సభ చేసి పనులు మొదలుపెట్టారు. అమరావతి ప్రాంత నేల స్వభావం తెలియకపోతే పోయింది... కనీసం కేంద్రీకృత నగరాల వల్ల కలిగే ముప్పును చూస్తూ కూడా వేలకోట్లు కుమ్మరిస్తున్నారంటే ఏమనుకోవాలి?
‘ప్రకృతి వైపరీత్యాలు నిజమైన అర్థంలో ప్రకృతి కల్పిస్తున్న వైపరీత్యాలు కాదు. అవి మనిషి రూపొందించే విధానాల వైఫల్యం’ అంటాడు అమెరికన్ దౌత్య నిపుణుడు జాన్ బోల్టన్. కుంభవృష్టి కురిసినా దాన్నంతటినీ ఇముడ్చుకోగల చెరువులూ, వాగులూ, వంకలూ దాదాపు అన్ని రాష్ట్రా ల్లోనూ వున్నాయి. వాటిల్లో కొన్ని సహజసిద్ధమైనవీ, కొన్ని మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో నిర్మించినవీ. కానీ చేజేతులా మనమే వాటి పీకనొక్కుతున్నాం. ఇష్టానుసారం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నా కళ్లుమూసుకుంటున్నాం.
హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూముల్లో బుల్‌డోజర్లు దింపి ప్రకృతి సంపద నాశనం చేస్తున్నారని ఆవేదన చెందిన ప్రధానే, ఆ తర్వాత కొద్దిరోజులకే వేలాది ఎకరాల పంట భూముల్ని మాయం చేసే అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేశారు. తమ కూటమి ప్రభుత్వమైతే ఒక లెక్క... వేరే పార్టీ ప్రభుత్వమైతే ఒక లెక్క! నిర్దిష్టమైన విధానాల్లేకుండా ‘ఏ రోటి కాడ ఆ పాట’న్నట్టు ప్రవర్తించే పాలకుల వల్లే వైపరీత్యాలు ముంచుకొస్తున్నాయి. వీటిని నివారించటం మానవ మాత్రులకు సాధ్యం కాకపోవచ్చు. కానీ కాస్త తెలివితో వ్యవహరిస్తే వాటివల్ల కలిగే నష్టాలను కనిష్ఠ స్థాయికి తీసుకురావొచ్చు.
కారణాలేమైనా వాతావరణం గతంలో మాదిరి లేదు. మన విధ్వంసకర ఆచరణతో దాన్ని మరింత క్షీణింపజేస్తున్నాం. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణగానీ, వికేంద్రీకరణగానీ లేకపోవటంతో నగరాలు కిటకిటలాడుతున్నాయి. నగరాల్లోనే ఉపాధి అవకాశాలుండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడికే క్యూ కడుతున్నారు. పెరిగిన జనాభాకు తగినట్టు డ్రయినేజీ వ్యవస్థ లేకపోవటంతో చిన్నపాటి వర్షానికే నగరాలు నరకాలుగా మారుతున్నాయి.
ఈసారి వర్షరుతువు ఎలా వుండబోతున్నదో ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన నిరూపించింది. సహాయ సిబ్బందిని అందుబాటులో వుంచటంతో సహా పలు ముందస్తు చర్యలు తీసుకోవటం మినహా ఈ ఏడాది ఎటూ ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేదు. కనీసం రాబోయేకాలంలోనైనా అమల్లోవున్న విధానాలను సమీక్షించుకుని మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రణాళికాబద్ధమైన పథకాలు రూపొందించి అమలుచేసి, వికేంద్రీకరణపై దృష్టిసారిస్తే చాలావరకూ సమస్యలు పరిష్కారమవుతాయి.