అనర్హత వేటు లేవనెత్తిన ప్రశ్నలు

Sakshi Editorial On Rahul Gandhi Disqualified Conviction

చట్టం వేరు...ధర్మం వేరు. చట్టబద్ధమైన చర్యలన్నీ ధర్మబద్ధం కాకపోవచ్చు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడటానికి దారితీసిన సూరత్‌ కోర్టు తీర్పు, అంతక్రితం రెండు వారాలుగా అధికార, విపక్షాలు సాగిస్తున్న ఆందోళనల పర్యవసానంగా పార్లమెంటు స్తంభించి పోవటం వంటి పరిణామాలు ప్రజాస్వామ్య ప్రియులను కలవరపరుస్తాయి. పౌరులు ఎలా మెలగాలో, పాటించాల్సిన స్వీయ నియంత్రణలేమిటో చట్టాలు చెబుతాయి. 

అధికారానికుండే పరిమితులేమిటో కూడా తేటతెల్లం చేస్తాయి. కానీ వాటి ఆచరణ సక్రమంగా లేని చోట ఆ చట్టాలు కొందరికి చుట్టాలవుతాయి. మరికొందరికి అవరోధాలవుతాయి. కర్ణాటకలోని కోలార్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన రాహుల్‌ అవినీతికి, అక్రమాలకు పాల్పడి విదేశాలకు పరారైన నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీల పేర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు జత చేసి ‘దొంగలందరి ఇంటిపేరు మోదీ అని ఎందుకుంటుంది?’ అంటూ వ్యంగ్య వ్యాఖ్య చేశారు. 

రాహుల్‌ వ్యాఖ్య ఆ ఇంటి పేరుగల సామాజిక వర్గానికి ఇబ్బందికరంగా మారిందంటూ గుజరాత్‌ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌పై కోర్టు తీర్పునిచ్చింది. రాహుల్‌ వ్యాఖ్యతో చాలామందికి ఏకీభావం లేకపోవచ్చు. ప్రత్యర్థులనుసరించే విధానాలను విమర్శించటంకాక వారిపై దూషణలకు దిగటం చాన్నాళ్లుగా  రివాజుగా మారింది. ఇక భౌతికంగా నిర్మూలిస్తామని బెదిరింపులకు దిగటం, దౌర్జన్యాలకు పూనుకోవటం వంటివి చెప్పనవసరమే లేదు. అయితే ఈ ధోరణులను వ్యతిరేకించేవారు సైతం రాహుల్‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్షను, దాని ఆధారంగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయటం సమర్థించలేకపోతున్నారు. 

గతంలో రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పుడు రాహుల్‌ ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని వ్యాఖ్యానించి వివాదంలో చిక్కు కున్నారు. ప్రధానినుద్దేశించి వ్యాఖ్య చేయబోయి సుప్రీంకోర్టును తప్పుబట్టేలా మాట్లాడటంతో సమస్య ఏర్పడింది. ఆ కేసులో రాహుల్‌ బేషరతు క్షమాపణ చెప్పడాన్ని అంగీకరించి సర్వోన్నత న్యాయస్థానం 2019లో కేసు మూసివేసింది. అయితే రాహుల్‌ వంటి నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికింది. సూరత్‌ కోర్టు దాన్నే గుర్తుచేసింది.

ఈ తీర్పుపైనా, అనర్హత వేటుపైనా ఎటూ కాంగ్రెస్‌ అప్పీల్‌కి వెళ్తుంది. అక్కడ ఏమవుతుందన్న సంగతి అటుంచి, సూరత్‌ కోర్టు తీర్పు లేవనెత్తిన అంశాలు ప్రధానమైనవి. పరువు నష్టం కలిగించటాన్ని నేరపూరిత చర్యగా పరిగణించి గరిష్టంగా రెండేళ్ల జైలు, జరిమానాకు వీలుకల్పించే భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని 499, 500 సెక్షన్ల సహేతుకతపై ఎప్పటినుంచో అభ్యంతరాలున్నాయి. ఒకపక్క పరువునష్టంలో సివిల్‌ దావాకు వీలున్నప్పుడు జైలుశిక్ష, జరిమానాలెందుకని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్రిటిష్‌ వలస పాలన కాలంలో చేసిన ఈ చట్టం ఇప్పుడు బ్రిటన్‌లోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ ఉనికిలో లేదు. ఇది దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉన్నది గనుక, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది గనుక రద్దు చేయాలని గతంలో సుప్రీంకోర్టుకెక్కిన వారున్నారు. 

అయితే పేరుప్రతిష్టలు కలిగివుండే హక్కు జీవించే హక్కులో భాగమని, దానికి భంగం కలిగించినవారు తగిన శిక్ష అనుభవించక తప్పదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అదే సందర్భంలో ఈ అంశంలో తీర్పులు వెలువరించేటపుడు జాగురూకత వహించాలని కింది కోర్టులకు సలహా ఇచ్చింది. అయితే ఈ సలహాను కింది కోర్టులు పాటిస్తున్నాయా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఒక రచనపై వచ్చిన విమర్శను తట్టుకోలేకనో, ఒక నాటకాన్నీ లేదా సినిమాను అడ్డుకోవటానికో ఈ సెక్షన్లను యధేచ్ఛగా వినియోగిస్తున్నారు. తమిళనాడులో జయ లలిత పాలనాకాలంలో ఆమె పార్టీకి చెందిన కార్యకర్తలు వందల సంఖ్యలో పరువునష్టం దావాలు వేసిన సంగతి ఎవరూ మరువలేరు. కోర్టులు సైతం యాంత్రికంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు కింది కోర్టులను తప్పుబట్టవలసి వచ్చింది. 

నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ తదితరులకు ప్రభుత్వ ప్రాపకం లభించిందని ఆరోపిస్తే రాహుల్‌కు బహుశా ఈ కేసు బెడద ఉండేదికాదు. తగిన ఆధారాలతో అటువంటి విమర్శలు చేస్తే దానివల్ల ప్రజలకు ఏదో మేరకు ప్రయోజనం కూడా కలుగుతుంది. రాహుల్‌ తన వ్యాఖ్యలద్వారా ఒక వెనుకబడిన వర్గాన్ని కించపరిచారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇలా రాజకీయ వ్యాఖ్యలను రాజకీయంగా ఎదుర్కొనటం తప్పేమీ కాదు. అందుకు భిన్నంగా న్యాయస్థానాలను ఆశ్రయించటం ఎంత వరకూ సబబో, చట్టానికి అనుగుణంగానే అయినా ఆదరాబాదరాగా అనర్హత వేటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఏమేరకు ధర్మమో ఆలోచించుకోవాలి. 

గతంలో లాలూ ప్రసాద్‌ యాదవ్, జయలలిత, ఆజంఖాన్‌ తదితరుల కేసుల్లో వెనువెంటనే చర్యలు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. అయితే ఈ ప్రక్రియ సందేహాస్పదం కారాదు. మెజారిటీ ఉంది కదా అని కక్షపూరితంగా చేశారన్న అపఖ్యాతి తెచ్చుకోకూడదు. దేశద్రోహులను కాల్చిపారేయాలని పిలుపునిచ్చిన వారు నిక్షేపంలా కేంద్రమంత్రు లుగా కొనసాగుతుంటే విపక్ష నేత నోరుజారటం మాత్రం మహాపరాధం కావటం సాధారణ పౌరు లకు కొరుకుడుపడని అంశం. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాన లక్ష్యం రాహులేనని పార్లమెంటులోని పరిణామాలైనా, తాజా చర్య అయినా తేటతెల్లం చేస్తున్నాయి. రాజకీయ పక్షాలూ, వాటి వ్యూహాల మాటెలా వున్నా దేశంలో చట్టబద్ధ పాలనకూ, సమన్యాయానికీ విఘాతం కలగనీయకుండా చూడాలని సాధారణ పౌరులు కోరుకోవటం అత్యాశేమీ కాదు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top