కరుణ లేని కాఠిన్యం

Sakshi Editorial On Human Rights Activist Stan Swamy

ఒక మనిషి తన ప్రాణం కోసం కాకుండా, తనకు ప్రాణానికి ప్రాణమైన మనుషుల కోసం తపిం చడం పాపమా? ప్రాణం పోతోందని తెలిసినా, అదేదో తన వాళ్ళ మధ్య ప్రాణాలు వదిలితే బాగుం టుందని కోరుకోవడం నేరమా? నిరూపితం కాని నేరాన్ని సాకుగా చూపి, ఉగ్రవాదం ముసుగు వేసి, నిందితుల ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచడం ఏ చట్టం కిందైనా న్యాయమా? ఆఖరు శ్వాస విడిచేవరకు గిరిజనుల హక్కులైన ‘జల్, జంగిల్, జమీన్‌’ కోసమే పోరాడి, అన్యాయంగా కన్ను మూసిన క్రైస్తవ సన్యాసి 84 ఏళ్ళ ఫాదర్‌ స్టాన్‌ స్వామి గురించి విన్నా, చదివినా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వెంటాడతాయి. కరోనా కేసులు ఎక్కువున్న కిక్కిరిసిన తలోజా జైలు నుంచి మార్చమనీ, అనారోగ్య రీత్యా మధ్యంతర బెయిలు ఇవ్వమనీ కోర్టులో పదే పదే ప్రార్థించినా, ప్రాథేయ పడ్డా ఆయనది అరణ్య రోదన కావడం ఓ విషాదం. చెవులు వినిపించని, శారీరకంగా బలహీనుడైన ఓ మానవతావాది దేశంలో అశాంతి సృష్టించి, ప్రభుత్వాన్ని పడదోసే కుట్ర చేస్తున్నారని ఎన్‌ఐఎ కోర్టు భావన. కానీ, అలా తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని ఐరాస ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. స్టాన్‌ స్వామిది మామూలు మరణం కాదు... ‘వ్యవస్థ చేసిన హత్య’ అని అనేకులు అంటున్నది అందుకే! దళితులు, అడవిబిడ్డల కోసం ఆఖరిదాకా తపించిన మనిషి సోమవారం మధ్యాహ్నం సంకెళ్ళు లేని లోకానికి, ఏ బెయిలూ అవసరం లేకుండానే శాశ్వతంగా వెళ్ళిపోయారు. 

అనారోగ్యంతో ఉన్నా కూడా ఈ సేవామూర్తి అయినవాళ్ళనుకున్న గిరిజనుల మధ్య ఆఖరు క్షణాలు గడిపేందుకు కాస్తంత కనికరం చూపమనే కోరడం గమనార్హం. జైలు నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి కూడా అధికారులు 10 రోజులు ఆలస్యం చేసిన స్టాన్‌ స్వామి ఉదంతం కన్నీరు తెప్పిస్తుంది. ఇరవై ఆరేళ్ళ క్రితం సంచలనమైన వివాదాస్పద వ్యాపారవేత్త, ‘బిస్కెట్‌ కింగ్‌’ రాజన్‌ పిళ్ళై కస్టడీ మరణం కేసు అనివార్యంగా గుర్తొస్తుంది. అరెస్టయి, అనారోగ్యంతో బాధపడుతూ, సమయానికి తగిన వైద్యం అందక తీహార్‌ జైలులో తుదిశ్వాస విడిచిన పిళ్ళై కేసు అనేక పాఠాలు నేర్పింది. జైలు యంత్రాంగం నిర్లక్ష్యానికీ, న్యాయవ్యవస్థ కాఠిన్యానికీ పిళ్ళై మరణం మచ్చుతునక. ఇప్పుడు ‘ఎల్గార్‌ పరిషత్‌ కేస్థు’ నిందితులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని వాదిస్తున్న ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ), జైలు అధికారుల లోపభూయిష్ఠ వ్యవహారం అందుకేమీ తీసిపోవడం లేదు. ఇదే ఇప్పుడు పలువురి ఆవేదన. స్టాన్‌ స్వామితో సహా పలువురు విద్యావేత్తలు, న్యాయవాదులు, సాంస్కృతిక కార్యకర్తలపై ఇంతటి కర్కశత్వం అవసరం లేదనేదే వారి వాదన. 

‘ఎల్గార్‌ పరిషత్‌’ సమావేశం, ‘భీమా – కోరేగావ్‌’ హింస కేసులో ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (యూఏపీఏ – ఉపా) కింద ఇప్పటికీ మరో 15 మంది జైలు గోడల మధ్య మగ్గుతున్నారు. వారిలో మన విప్లవ కవి వరవరరావు సహా సుధా భరద్వాజ్‌ లాంటి ప్రజాక్షేత్రంలోని ప్రసిద్ధులు పలువురు ఉన్నారు. వారందరిలోకే కాదు... ‘ఉపా’ చట్టం కింద దేశంలో ఇప్పటి దాకా అరెస్టయినవారిలోనే బహుశా అత్యంత వృద్ధుడు ఫాదర్‌ స్టాన్‌ స్వామే! పార్కిన్సన్స్‌ వ్యాధితో వణుకుతున్న చేతులతో అన్నం తినడానికీ, నీళ్ళు తాగడానికీ వీల్లేక, కనీసం స్ట్రా, సిప్పర్‌ కావాలని ప్రాథేయపడితే, ఎన్‌ఐఏ అందుకు 4 వారాల గడువు తీసుకుందంటే విషయం అర్థం చేసుకోవచ్చు. న్యాయపోరాటంలో అలసిపోయిన స్టాన్‌ స్వామి కథ చివరకు అత్యంత విషాదంగా ముగిసింది. 

ఇప్పుడిక మిగతా ఖైదీల విషయంలోనైనా సమయం మించిపోక ముందే సరైన నిర్ణయం తీసు కోవడం అవసరం. ఆ కేసు నిందితుల్లో అత్యధికుల శారీరక అశక్తత, ఆరోగ్య, వృద్ధాప్య సమస్యలు గుర్తించాలి. ఒకపక్క దర్యాప్తు, విచారణ కొనసాగిస్తూనే, మానవతా దృక్పథంతోనైనా వారికి మధ్యం తర జామీనివ్వడం న్యాయపరంగా తప్పేమీ కాదు. కఠిన చట్టాల ఉక్కుపాదం మోపి, రుజువు కాని దేశద్రోహం కింద వారిని ఏళ్ళ తరబడి జైలులో మగ్గబెట్టడం మానవీయతా కాదు. ‘అర్బన్‌ నక్సల్‌’ అనే కొత్తముద్ర తయారుచేసి, కర్కశత్వానికి కొత్త చిరునామాగా మారిందనే అపఖ్యాతి పాలకులకూ శోభనివ్వదు. ఇప్పటికే ఒకసారి కరోనా బారినపడి, ఆఖరు నిమిషంలో అదృష్టవశాత్తూ బయటపడ్డ వరవరరావు లాంటి వారిని చివరి రోజులైనా ప్రశాంతంగా బతకనివ్వడమే న్యాయం, సమంజసం.

రాజన్‌ పిళ్ళై మరణించిన దశాబ్దిన్నర తరువాత ‘ఆ మరణానికి బాధ్యత ప్రభుత్వానిదే’ అంటూ న్యాయస్థానమే తప్పుబట్టింది. కానీ, అప్పటికే అంతా అయిపోయింది. అమితమైన ఆలస్యమూ అయిపోయింది. ఆలస్యమైన న్యాయం... అక్షరాలా అన్యాయమే! పోయిన ప్రాణానికి బాధ్యత వహించాల్సిన విషతుల్యమే! అందుకే, అతి వృద్ధుడైనా... కనీసం సర్కారు వారి టీకాకు కూడా నోచుకోక, అన్యాయంగా కరోనా కోరలకు చిక్కి కన్నుమూసిన స్టాన్‌ స్వామి ఆఖరి వీడియో సందేశం ఇక ఎప్పుడు చూసినా గుండె బరువెక్కుతూనే ఉంటుంది. వ్యవస్థలో జరిగిన అన్యాయాన్నీ, కరుణించని న్యాయదేవత కాఠిన్యాన్నీ, సమాజ వైఫల్యాన్నీ గుర్తుచేస్తూనే ఉంటుంది.

ప్రజాస్వామ్యవాదులకూ, మానవతావాదులకూ ఇది పాలకులు మిగిల్చిన ఓ శాశ్వతమైన గుండెకోత. స్టాన్‌ స్వామి వెళ్ళిపోయారు... ఆయన చూపిన  బాట, చేసిన పని మాత్రం మిగిలిన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. ఫాదర్‌ స్టాన్‌ స్వామీ! మూడు దశాబ్దాల పైగా మీరు హక్కుల కోసం పోరాడిన ఆదివాసీల మధ్యే తుదిశ్వాస విడవాలన్న మీ ఆఖరి కోరికను తీర్చలేకపోయాం. మన్నించండి! ఇప్పటికైనా వ్యవస్థలో వివేకం మేలుకోవాలని దీవించండి!! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top