స్వదేశీ ఆయుధ సంపత్తి

Sakshi Editorial On Combat Helicopter Prachanda

విజయదశమి.. ఆయుధపూజ వేళ... భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ (ఎల్‌సీ హెచ్‌) ‘ప్రచండ’ చేరికతో మన సైన్యానికి కొత్త జవసత్వాలు సమకూరాయి. జోద్‌పూర్‌ వైమానిక కేంద్రం వేదికగా సోమవారం సైనిక ఉన్నతాధికారులతో కలసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలివిడతగా నాలుగు హెలికాప్టర్లను లాంఛనంగా వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. పలు విధాలుగా ఇది కీలక ఘట్టం. పొరుగున చైనా నుంచి పొంచివున్న ముప్పు నేపథ్యంలో ప్రధానంగా ఎల్తైన పర్వత ప్రాంతాల్లో సైతం శత్రువులపై పోరాడే దేశవాళీ ఛాపర్‌ ఇప్పుడు మన చేతిలో ఉన్నట్టయింది. 

ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌ – హాల్‌) తయారు చేసిన ఈ లోహవిహంగం గణనీయంగా ఆయుధాలు, ఇంధనం తీసుకొని 5 వేల మీటర్ల ఎత్తున కూడా కిందకు దిగగలదు. టేకాఫ్‌ తీసుకోగలదు. ప్రపంచంలో అలాంటి యుద్ధ హెలికాప్టర్‌ ఇదొక్కటే అని నిపుణుల మాట.

అతి వేడిగా ఉండే ఎడారుల్లో, రక్తం గడ్డ కట్టించే అతి ఎల్తైన ప్రాంతాల్లో, విద్రోహ చర్యల్ని విచ్ఛిన్నం చేసే వేళల్లో – ఇలా అన్ని యుద్ధ సందర్భాల్లో గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించ గలగడం ఈ లోహ విహంగాల ప్రత్యేకత. వెరసి, సైనిక ఆయుధాలను విదేశాల నుంచి కొనడానికే పేరుబడ్డ భారత్‌ ఈ దేశీయ తయారీ యుద్ధ హెలికాప్టర్లతో కనీసం ఇంతవరకైనా బయ్యర్‌ నుంచి బిల్డర్‌గా మారింది. ‘మేకిన్‌ ఇండియా’ స్వప్నసాకారంలో ఒక అడుగు ముందుకు పడింది. 

1999 నాటి కార్గిల్‌ యుద్ధవేళ దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ అవసరం తొలిసారిగా మనకర్థమైంది. అప్పటికి మన దగ్గర చేతక్, చీతా లాంటి హెలికాప్టర్లే ఉన్నాయి. కానీ మరింత చురుగ్గా, బహు పాత్రపోషణ చేయగలవి అవసరమయ్యాయి. ఆ పరిస్థితుల్లో తొలి దశ చర్చల తర్వాత 2006 అక్టోబర్‌లో ప్రభుత్వం ఎల్‌సీహెచ్‌ ప్రాజెక్ట్‌ను ‘హాల్‌’కు మంజూరు చేసి, వాటిని అభివృద్ధి చేసే బాధ్యతను అప్పగించింది.

అలా పైలట్, కోపైలట్‌లు ఒకరి వెనుక మరొకరు కూర్చొనేలా ఈ రెండు ఇంజన్ల, 5.8 టన్నుల లోహ విహంగాన్ని డిజైన్‌ చేశారు. అనేక కఠిన పరీక్షల అనంతరమే ఈ ఛాపర్లకు అనుమతినిచ్చి, సైన్యంలోకి తీసుకున్నారు. అందుకు 2010– 2015 మధ్య 4 నమూనా ఛాపర్లు సిద్ధం చేసి, రకరకాల ఎత్తుల్లో, 2 వేలకు పైగా గగనయాన పరీక్షలు చేశారు. 

2017లో వైమానిక దళ నమూనాకూ, 2019లో ఆర్మీ నమూనాకూ తొలిదశ అనుమతి వచ్చింది. నిరుడు నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రతీకాత్మకంగా ఎల్‌సీహెచ్‌ను భారత వైమానిక దళానికి అప్పగించి, ఆఖరి ఘట్టానికి తెర తీశారు. ఈ మార్చిలో భద్రతా వ్యవహారాల మంత్రివర్గ సంఘం వాయుసేనకు 10, ఆర్మీకి 5 – మొత్తం 15 ఎల్‌సీహెచ్‌ల తయారీకి ఆమోదం తెలిపింది. దరిమిలా సెప్టెంబర్‌ 29న బెంగళూరులో ఆర్మీలోకీ, ఇప్పుడు జోద్‌పూర్‌లో వాయుసేనలోకీ ఎల్‌సీహెచ్‌లను లాంఛనంగా ప్రవేశపెట్టారు.

ఇలాంటి ఎల్‌సీహెచ్‌లు 160 దాకా మనకు అవసరం. గంటకు 268 కి.మీ గరిష్ఠ వేగంతో వెళ్ళగల ఈ ‘ప్రచండ’ ఛాపర్లలో అనేక ప్రత్యేకతలున్నాయి. 6.5 కి.మీ ఎత్తున ఎగరగల సత్తా ఈ లోహ విహంగం సొంతం. 20 ఎంఎం టరెట్‌ గన్, 70 ఎంఎం రాకెట్లు, గగనతల క్షిపణి వ్యవస్థలతో ఇది యుద్ధసన్నద్ధమై ఉంటుంది. శత్రు రాడార్ల గురి నుంచి రక్షణవ్యవస్థ ఉండే ఈ ఛాపర్‌ ముష్కరుల గగనతల భద్రతావలయాన్ని ఛేదించి, విద్రోహ చర్యలను తిప్పికొడుతుంది.  

తొలి దేశీయ యుద్ధ విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ జలప్రవేశం చేసి నెల తిరిగేసరికి ఇప్పుడు ఈ యుద్ధ హెలికాప్టర్లు మన వైమానికదళానికి సమకూరడం సంతోషమిచ్చే పరిణామం. వీటికన్నా ముందే ఈ జూన్‌లో తీరప్రాంత గస్తీ దళంలోకి దేశవాళీ అడ్వాన్స్‌›్డ లైట్‌ హెలికాప్టర్‌ ఎంకె–3 వచ్చి చేరింది. భారత రక్షణ రంగానికి ఇవన్నీ శుభసూచనలు.

రక్షణ రంగంలో ఒకపక్క దిగుమతులు తగ్గించుకొంటూనే, మరోపక్క అంతర్జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకుంటున్న ట్టయింది. గత అయిదేళ్ళలో మన రక్షణ ఎగుమతులు 334 శాతం పెరిగాయని సర్కారు వారి మాట. ప్రస్తుతం 75కి పైగా దేశాలకు మన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. మన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌పై మలేసియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, అమెరికా, ఇండొనేసియా, ఫిలిప్పైన్స్‌ సైతం ఆసక్తి కనబరచడం విశేషం. 

రక్షణ ఉత్పత్తుల దేశవాళీ డిజైనింగ్, అభివృద్ధి, తయారీకై కొన్నేళ్ళుగా తీసుకుంటున్న విధాన నిర్ణయాలు క్రమంగా ఫలితమిస్తున్నట్టున్నాయి. విదేశాల నుంచి రక్షణ ఉత్పత్తుల్ని మనం దిగుమతి చేసుకోవడం 2012–16తో పోలిస్తే, 2017–21లో దాదాపు 21 శాతం తగ్గాయని స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చెబుతోంది. అయితే, ఇప్పటికీ ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలో మనం ముందు వరుసలోనే మిగిలాం.

రష్యన్‌ తయారీ ఆయుధాలపై భారీగా ఆధార పడ్డాం. ఈ పరిస్థితి మారాలంటే, తక్కువ వ్యయంతోనే ప్రపంచ ప్రమాణాలను అందుకొనే సాంకేతి కతను అభివృద్ధి చేయాలి. అదే అతి పెద్ద సవాలు. చిక్కులు లేకుండా ప్రభుత్వం అవసరమైన వనరుల్ని అందించి, పరిశోధన – అభివృద్ధిని ప్రోత్సహిస్తే, కీలక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి ఆ సవాలును అధిగమించవచ్చు.

రక్షణ రంగంలో దిగుమతులు తగ్గించుకొని, సొంత కాళ్ళ మీద నిలబడవచ్చు. దృఢసంకల్పం ఉంటే అది అసాధ్యమేమీ కాదని ‘ప్రచండ్‌’ రూపకల్పన చెబుతోంది. సాధించిన ఘనతతో పాటు సాధించాల్సిన లక్ష్యాలను మరోసారి గుర్తుచేస్తోంది.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top