చదరంగపు బాలరాజు

Sakshi Editorial On Chess R Praggnanandhaa Beat Chess World No 1 Magnus Carlsen

టీవీ కార్టూన్‌ షోలు తెగ చూస్తున్న పాపను దాని నుంచి దూరం చేయడానికి తల్లితండ్రులు అనుకోకుండా చేసిన ఓ అలవాటు ఆ పాపతో పాటు మూడేళ్ళ వయసు ఆమె తమ్ముడి జీవితాన్నీ మార్చేసింది. కాలగతిలో చదరంగపు క్రీడలో అక్క గ్రాండ్‌ మాస్టర్‌ అయితే, తమ్ముడు ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ మాస్టర్‌గా ఎదిగాడు. ఏకంగా ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌నే ఓడించి, అబ్బురపరిచాడు. సరైన సమయంలో సరైన మార్గదర్శనం చేస్తే పిల్లలు ఏ స్థాయికి ఎదగగలరో, ఇంటిల్లపాదినే కాదు... ఇండియాను ఎంత గర్వించేలా చేస్తారో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం – తమిళనాడుకు చెందిన టీనేజ్‌ అక్కాతమ్ముళ్ళు వైశాలి, ప్రజ్ఞానంద. ఇంటా, బయటా తెలిసినవాళ్ళంతా ప్రగ్గూ అని పిలుచుకొనే పదహారేళ్ళ ఆర్‌. ప్రజ్ఞానంద చదరంగంలో తన ఆరాధ్యదైవమైన వరల్డ్‌ ఛాంపియన్‌ మ్యాగ్నస్‌ కార్ల్‌సన్‌ను సోమవారం తెల్లవారుజామున ఓడించి సంచలనం రేపాడు. క్లాసికల్, ర్యాపిడ్, ఎగ్జిబిషన్‌ – ఇలా ఏ ఫార్మట్‌ గేమ్‌లలోనైనా కలిపి మన విశ్వనాథన్‌ ఆనంద్, తెలుగు తేజం పెంటేల హరికృష్ణ తరువాత కార్ల్‌సన్‌ను ఓడించిన మూడో భారత క్రీడాకారుడిగా ప్రగ్గూ చరిత్ర సృష్టించాడు.

నార్వేకు చెందిన కార్ల్‌సన్‌ అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌. కొంతకాలంగా ప్రపంచ చదరంగానికి మకుటం లేని మహారాజు. అలాంటి వ్యక్తిని ఓడించడం ఆషామాషీ కాదు. అరవై నాలుగు గడులు... మొత్తంగా చకచకా 39 ఎత్తులు... అంతే.... కార్ల్‌సన్‌కు చెక్‌ పెట్టి, ప్రగ్గూ నమ్మలేని విజయాన్ని నమోదు చేశాడు. వరుసగా మూడు విజయాలు సాధించిన ప్రపంచ విజేతకు బ్రేకులు వేశాడు. ఆన్‌లైన్‌లో సాగే ర్యాపిడ్‌ చెస్‌ పోటీ ‘ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌’ ప్రారంభ విడతలోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. 31 ఏళ్ళ కార్ల్‌సన్‌పై గతంలో విశ్వనాథన్‌ ఆనంద్‌ 19 సార్లు, హరికృష్ణ 2 సార్లు గెలిచారు. వారి కన్నా అతి పిన్న వయసులోనే, కార్ల్‌సన్‌ వయసులో సగమున్న బుడతడైన ప్రగ్గూ ఈ ఘనత సాధించడం గమనార్హం. ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి, చదరంగంలో అగ్రశ్రేణి వరుసను అటుదిటు చేసిన ఈ బాలమేధావి అమాయకంగా అన్నమాట మరింత కాక రేపింది. ప్రపంచ ఛాంపియన్‌పై జరిగే మ్యాచ్‌ కోసం ప్రత్యేకించి వ్యూహమేమీ అనుకోలేదనీ, ఆస్వాదిస్తూ ఆడానే తప్ప మరేమీ చేయలేదనీ ఈ టీనేజర్‌ అనడం విశేషం.

ఆట మొదలుపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తెల్లపావులతో ఆడేవారికి ఓ రకంగా సానుకూలత ఉంటుందని భావించే చెస్‌లో నల్ల పావులతో ఆరంభించి, ఈ కీలక మ్యాచ్‌లో నెగ్గాడీ బాలరాజు. మొత్తం 16 మంది ఆటగాళ్ళ మధ్య 15 రౌండ్ల పాటు జరిగే టోర్నీ ఇది. ఇందులో ఈ మ్యాచ్‌కు ముందు ప్రగ్గూ ప్రపంచ అగ్రశ్రేణి చెస్‌ ఆటగాళ్ళు పదిమందిలో నలుగురితో తలపడి, రెండు విజయాలు, ఒక డ్రా, ఒక పరాజయంతో తన ప్రతిభను క్రీడాలోకం ఆగి, చూసేలా చేశాడు. ఆత్మీయుల మొదలు విశ్వనాథన్‌ ఆనంద్, దిగ్గజ క్రికెటర్‌ సచిన్, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ దాకా విభిన్న రంగాల ప్రముఖుల ప్రశంసలు పొందాడు. కరోనా కాలంలో చెస్‌ పోటీల క్యాలెండర్‌ తారుమారై, నిరాశలో పడి, కాస్తంత వెనకపట్టు పట్టిన ఈ చిచ్చరపిడుగుకు ఇది సరైన సమయంలో దక్కిన భారీ విజయం. కోచ్‌ ఆర్బీ రమేశ్‌ చెప్పినట్టు ప్రతిభావంతుడైన ప్రగ్గూలో ఆత్మవిశ్వాసం పెంచి, సుదీర్ఘ ప్రస్థానానికి మార్గం సుగమం చేసే విజయం. 

 శ్రీనాథ కవిసార్వభౌముడు అన్నట్టే ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడె...’ ప్రగ్గూ తన సత్తా చూపడం మొదలుపెట్టాడు. ముచ్చటగా మూడేళ్ళకే అక్కను చూసి ఆడడం మొదలుపెట్టిన ఈ బుడతడు 2013లో వరల్డ్‌ అండర్‌–8 కిరీటధారి అయ్యాడు. పదేళ్ళ, పదినెలల, 19 రోజుల వయసుకే 2016లో ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ మాస్టరయ్యాడు. అప్పటికి ఆ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా గిన్నిస్‌ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. మొత్తం మీద ఇప్పుడు చరిత్రలో పిన్న వయసు గ్రాండ్‌ మాస్టర్లలో అయిదోవాడిగా నిలిచాడు. భారత కాలమానంలో బాగా పొద్దుపోయి, రాత్రి 10 దాటాకెప్పుడో మొదలయ్యే తాజా టోర్నీ కోసం నిద్ర వేళల్ని మార్చుకోవడం సహా పలురకాల సన్నాహాలు చేసుకున్నాడు ప్రగ్గూ. చెన్నై శివార్లలోని పాడి ప్రాంతంలో మధ్యతరగతి నుంచి వచ్చిన ఈ బాల మేధావికి చెస్, బ్యాంకు ఉద్యోగం చేసే పోలియో బాధిత తండ్రి, ప్రతి టోర్నీకీ సాయంగా వచ్చే తల్లి, చెస్‌లో ప్రవేశానికి కారణమైన 19 ఏళ్ళ అక్క, కోచ్‌ రమేశ్‌... ఇదే ప్రపంచం. 

గత ఏడాది ‘న్యూ ఇన్‌ చెస్‌ క్లాసిక్‌’ పోటీలో సైతం వరల్డ్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌పై పోటీని డ్రా చేసిన ఘనుడీ బాలుడు. భారత ఆటగాళ్ళలో 16వ ర్యాంకులో, ప్రపంచంలో 193వ ర్యాంకులో ఉన్న ఇతను చెస్‌లో భారత ఆశాకిరణం. ఒకప్పుడు తానూ ఇలాగే చిన్న వయసులోనే, ఇలాంటి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడే కావడంతో విశ్వనాథన్‌ ఆనంద్‌ ఈ బాల మేధావిని అక్కున చేర్చుకొన్నారు. వరల్డ్‌ ఛాంపియన్‌పై గెలుపు లాంటివి భారత ఆటగాళ్ళకు అప్పుడప్పుడు కాకుండా, తరచూ సాధ్యం కావాలంటే ప్రగ్గూ లాంటి వారికి ఇలాంటి సీనియర్ల చేయూత అవసరం. 1988లో ఆనంద్‌ తొలి ఇండియన్‌ గ్రాండ్‌ మాస్టరయ్యారు. అప్పటి నుంచి చెస్‌ పట్ల పెరిగిన ఆసక్తితో, 73 మంది మన దేశంలో గ్రాండ్‌ మాస్టర్లు ఎదిగొచ్చారు. మూడు దశాబ్దాల పైగా దేశంలో చదరంగానికి ప్రతీకగా మారిన 51 ఏళ్ళ ఆనంద్‌ పరంపర ప్రగ్గూ మీదుగా అవిచ్ఛిన్నంగా సాగాలంటే... ప్రభుత్వాలు, క్రీడా సమాఖ్యలు, దాతల అండదండలు అతి కీలకం. ఇలాంటి మాణిక్యాలను ఏరి, సానబడితే, ప్రపంచ వేదికపై రెపరెపలాడేది మన భారత కీర్తి పతాకమే. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top