సకల జన సమ్మతము | Sakshi Editorial On Anthology of Texts Sakalaneethi Sammathamu | Sakshi
Sakshi News home page

సకల జన సమ్మతము

Published Mon, Feb 6 2023 3:45 AM | Last Updated on Mon, Feb 6 2023 3:45 AM

Sakshi Editorial On Anthology of Texts Sakalaneethi Sammathamu

ఒక సాధారణ జీకే ప్రశ్నతో దీన్ని మొదలుపెట్టవచ్చు. తెలుగులో తొలి సంకలన కావ్యం ఏది? ‘సకల నీతి సమ్మతము’ అన్నది జవాబు. దీన్ని తెలుగులో తొలి నీతిశాస్త్ర గ్రంథంగానూ చెబుతారు. దీని సంకలనకర్త మడికి సింగన. తెలుగులో ఇలాంటి సంకలన గ్రంథాలకు శ్రీకారం చుట్టింది ఆయనే.   సింగనది ప్రధానంగా రాజనీతి దృష్టి. తనకు పూర్వులైన ఆంధ్రకవుల గ్రంథాల నుండి అందుకు సంబంధించిన పద్యాలను మాల కట్టాడు. పంచతంత్రి (మనకు తెలిసిన పంచతంత్రం కాదు), కామందకము, ముద్రామాత్యము, నీతిభూషణము, బద్దెన నీతి, కుమార సంభవము, భారతము, రామాయణము, మార్కండేయ పురాణము, విదురనీతి, చారుచర్య, పురుషార్థసారము, పద్మ పురాణము లాంటి మిక్కిలి కావ్యాలు ఆయనకు ఆధారం. ఆ పద్యాలను తిరిగి నీతిశాస్త్ర ప్రశంస, ప్రజా పాలనము, రాజాదాయవ్యయ ప్రకారము, రాజునకు గొఱగాని గుణములు, కరణికపు నీతులు, పురోహిత నీతి, రాయబార ప్రకారము, చారుల నీతులు, అష్టాదశ వ్యసనములు అంటూ మూడు ఆశ్వాసములుగా విభజించాడు. పద్దు లెక్కలు ఎలా వేయాలో, రుణ పత్రాలు ఎలా రాయాలో కూడా ఇందులో ఉంటుంది. ఆయన గొప్పతనం పద్యాలను ఏర్చడంలోనే కాదు, కూర్చడంలోనూ ఉంది. ఆయా వర్గాల పద్యాలకు అతుకులుగా తన సొంత పద్యాలను రాశాడు.    అందుకనో, అంతకుమునుపు ఈ సంకలన ప్రక్రియ లేనందునో తన కావ్యాన్ని ప్రబంధమనే చెప్పుకొన్నాడు. కానంతమాత్రాన దీని విలువ ఏమీ తగ్గలేదు. తరువాతి కాలంలో వచ్చిన సంకలన గ్రంథాలకు ఇది ఒక స్ఫూర్తిగా నిలిచింది.

ఇలాంటి ఉత్తమ గ్రంథాన్ని మానవల్లి రామకృష్ణ కవి 1923లో సంపాదించి ప్రకటించారు. ఆ ప్రచురణకు ఇది శతాబ్ది సంవత్సరం. విస్మృత కవుల కృతులలో ఒకటిగా మానవల్లి దీన్ని వెలువరించారు. ‘ఆంధ్రపత్రికా ముద్రాక్షర శాల’లో ముద్రితమైంది. తిరిగి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ 1979లో దీన్ని ‘విద్యారత్న’ నిడుదవోలు వేంకటరావు, డాక్టర్‌ పోణంగి శ్రీరామ అప్పారావు సంపాద కులుగా ప్రచురించింది. తెలంగాణ సాహిత్య అకాడెమీ కూడా ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ముద్రించింది. 

మడికి సింగన క్రీ.శ.1420 ప్రాంతపువాడు. ‘ఓరుగల్లున కుత్తరమున నుండు రామగిరి పట్టణమున కధీశ్వరుండగు కందన మంత్రి కాశ్రితుడై బహు గ్రంథముల రచించె’ని మానవల్లి రామకృష్ణ కవి రాశారు. ఇప్పటి వ్యవహారంలో చెప్పాలంటే తెలంగాణలోని ‘పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి’. పద్మ పురాణోత్తర ఖండము, భాగవతము దశమ స్కంధము(ద్విపద), జ్ఞాన వాసిష్ఠ రామాయణము ఆయన లభ్య రచనలు. ఆయన పేరు నిలిచి ఉన్నది మాత్రం సకల నీతి సమ్మత సంకలనకర్తగానే! ‘అల్లకల్లోలమైన దుగ్ధనిధి ద్రచ్చి / దేవామృతము తేటదేర్చుపగిది/ గంధకారుడు మున్నుగల వస్తువులు జోక గూర్చి సుగంధంబు గూడినట్లు/ అడవి పువ్వుల తేనెలన్నియు మధుపాళి యిట్టలంబుగ జున్ను వెట్టుభంగి/ దననేర్పు మెఱసి వర్తకుడు ముత్తెములీడు గూర్చి హారంబు తాగ్రుచ్చు కరణి’ రీతిలో ఈ గ్రంథం కూర్చానని  సింగన చెప్పుకొన్నాడు. రాజసభలలో పద్యాలను గమకముతో, అంటే రసోచిత స్థాయులతో చదివే వారి వాచకం ఎట్లుండాలో– ‘వెనుకకు బోక హాయనక వేసట నొందక బంతి బంతిలో బెనపక... యక్షరాక్షరము కందువు దప్పక యేకచిత్తుడై యనుపమ భక్తితో జదువునాతని వాచకుడండ్రు సజ్జనుల్‌’ పద్యం చెబుతుంది. ‘రవికి మఱుగైన   గొందిని దివియ’ ప్రకాశింపజేసినట్టుగా, అధికుడు తెలుపని యుక్తివిశేషాన్ని ‘చిఱుతవాడు’ చెప్పగలండంటుంది ఇంకొక పద్యం. ‘సరస కవిత రుచి యెఱుగని పురుషుల బశువులని నిక్కముగ నెఱుగు’మంటుంది మరొకటి. ‘కుక్క తోక బట్టుకొని మహాంబుధి దాట’డం, ‘తల్లి సచ్చినను జూదరి లేచిపోవండు’ లాంటి వాడుకలు, జాతీయాలు ఇందులో కనిపిస్తాయి.

వాఙ్మయ పరిశోధన మనకు 15వ శతాబ్దిలోనే, అంటే మడికి సింగనతోనే మొదలైందంటారు పెద్దలు. అంతకుముందున్న కావ్యాలను చదివి, వాటిని క్రోడీకరించి, ఒక్కచోట అందుబాటులో ఉంచారు కదా! ‘‘ఆంధ్ర సాహిత్య పరిశోధనా రంగమున సింగన ప్రథముడు; అతని కృతి తెలుగున ప్రథమ పరిశోధనా గ్రంథము’’ అంటారు నిడుదవోలు వేంకటరావు. ‘‘అయితే, ప్రస్తుత కాలము వలె, ఆ కాలమున పరిశోధనకు పట్ట ప్రదానము లేదు. అంతే భేదము.’’ మనం సంబరపడటానికి ఇంకొక విషయం కూడా ఉన్నది. అంతకుముందు ఇంత నిధి ఉన్నదని మరోమారు రుజువవుతోంది కదా! సకల నీతి సమ్మతమును వెలికి తెచ్చిన మానవల్లి రామకృష్ణ కవి(1866–1957) మద్రాసులో జన్మించిన బహుభాషా పండితుడు. పదహారేళ్లకే ‘కవి’ బిరుదును పొందినవాడు. తెలుగు ‘కుమార సంభవం’ కావ్యాన్ని వెలికి తీసి, నన్నెచోడుని పేరును లోకానికి చాటిన మహానుభావుడు. అనంతర గొప్ప పరిశోధకులైన వేటూరి ప్రభాకర శాస్త్రి, తిరుమల రామచంద్ర వంటివారికి మార్గదర్శి.  తాళపత్ర గ్రంథాల కోసం ఆయన ఊరూరా తిరిగేవారు. వాటిని ఇవ్వడానికి ఆ యజమానులు ఒప్పుకోకపోతే అక్కడే చదివి ఏకసంథాగ్రాహిలా బసకు వచ్చి అక్షరం పొల్లుపోకుండా రాసుకునేవారట. ‘నైజాము రాజ్యమున... అమరచింత రాజాస్థానామున’ ఆయన ‘సకల నీతి సమ్మతము’ లిఖిత ప్రతిని చూశారు. మానవల్లి తన అవసాన దశలో కఠిన దారిద్య్రాన్ని అనుభవించి, వీధుల వెంట భిక్షాటన చేస్తూ బతికాడంటారు. కానీ ఆయనే తెలుగు సాహిత్య లోకానికి కావ్య సిరులను భిక్షగా వేశారని చెప్పాలి. ఆయన తన పేరును ‘మా– రామకృష్ణ కవి’ అని పూర్వపు తెలుగు పద్ధతిలో రాసుకునేవారు. అలా ఆయన ‘మా రామకృష్ణ కవి’ అవుతారు, మన రామకృష్ణ కవి అవుతారు. మన మడికి సింగన! మన రామకృష్ణ కవి!! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement