దుప్పట్లో మిన్నాగు!

Sakshi Editorial On Afghanistan Present Condition

ఒక్కొక్క కోట ఒరిగిపోతోంది. ఒక్కో నగరం తీవ్రవాదుల చెరలో చేరిపోతోంది. ప్రతిఘటిస్తున్న అఫ్గానిస్తాన్‌ సేనలతో భీకరపోరు నడుమనే 34 ప్రొవిన్షియల్‌ రాజధానుల్లో 10 సాయుధ తాలిబన్ల వశమయ్యాయి. ఆ దేశంలోని 65 శాతం భూభాగం తాలిబన్ల చేతికి వచ్చేసింది. అమెరికా సారథ్యంలోని సేనలు వెనక్కి వచ్చేస్తున్న నేపథ్యంలో, తాలిబన్ల దండయాత్రలో నెల రోజుల్లో అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌ ఏకాకి కానుంది. మూడు నెలల్లో కాబూల్‌ కోటపై తాలిబన్ల తీవ్రవాద జెండా ఎగరనుంది. సాక్షాత్తూ అమెరికా గూఢచారి విభాగం వేసిన ఈ అంచనా ఆందోళన రేపుతోంది. వెయ్యిమందికి పైగా పౌరులు నెలరోజుల్లో అక్కడ బలి అయ్యారు. ఈ ఒక్క నెలలోనే 4 వేల మందికి పైగా గాయపడ్డారు. విమాన సేవలు ఆగిపోక ముందే, అఫ్గాన్‌ను వదిలి వచ్చేయాల్సిందిగా భారత్, అమెరికా సహా అనేక దేశాలు తమ పౌరులకు సూచించాయి. అఫ్గాన్‌లోని తీవ్రతకు అది దర్పణం.

అఫ్గాన్‌లో హింసకు తెర దించేందుకు చివరకు ఆ దేశ ప్రభుత్వమే దిగివచ్చింది. తాలిబన్లతో అధికారం పంచుకొనేందుకు సిద్ధపడింది. ఆ మేరకు ఓ ప్రతిపాదన చేసినట్టు తాజా సమాచారం. పొరుగుప్రాంతాలపై ప్రభావ రీత్యా ప్రపంచ దేశాలు ఈ అఫ్గాన్‌ పరిణామాలపై ఇక నిశితంగా దృష్టి పెట్టక తప్పదు. అఫ్గాన్‌ సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆ మధ్య ‘ఈద్‌’ వేళ తాలిబన్లు ప్రకటించారు. కానీ, సాయుధ తీవ్రవాద సమూహమైన తాలిబన్‌లు 2001లో అధికారం కోల్పోక ముందు అఫ్గాన్‌లో ఎలాంటి ఆటవిక రాజ్యం నడిపారో తెలిసిందే. ఇప్పుడేమో అమెరికా సైన్య ఉపసంహరణ వేళ చేసిన శాంతి బాసలూ తప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు తగినంత చొరవ తీసుకోకుండా, చూసీచూడనట్టున్నాయా అనిపిస్తే ఆశ్చర్యం లేదు.

మధ్యప్రాచ్య దేశమైన ఖతార్‌ మాత్రం అఫ్గాన్‌లో శాంతి ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తోంది. ఖతార్‌ రాజధాని దోహాలో వివిధ ప్రాంతీయ దేశాల మధ్య జరుగుతున్న అఫ్గాన్‌ శాంతి చర్చల్లో ఇటీవలి కాలంలో తొలిసారిగా ఈ గురువారం మన దేశం పాల్గొంది. రష్యా చొరవ, అమెరికా మద్దతు ఉన్నా ఈ చర్చల్లో భారత్‌ను చేర్చనివ్వకుండా పాక్, చైనాలు గతంలో గండికొట్టాయి. కానీ, ఇప్పుడు ఖతార్‌ చొరవతో తప్పలేదు. ఖతార్‌ మధ్యవర్తిత్వం వల్లనే తాజాగా తాలిబన్లతో అధికార పంపిణీ ప్రతిపాదన వచ్చిందని సమాచారం. అలాగే, ప్రతివారం కనీసం 30 వేల మంది అఫ్గాన్లు దేశం విడిచి పోతున్న వేళ, శరణార్థుల అంశం కూడా రేపో మాపో తెర పైకి రానుంది.

తీవ్రవాదుల పురుటిగడ్డగా తయారైన అఫ్గాన్‌లో ‘తీవ్రవాదంపై పోరు’కు అమెరికా గత ఇరవై ఏళ్ళలో ట్రిలియన్‌ డాలర్ల పైగా ధనం, వేలాది సైనికుల ప్రాణాలు పణంగా పెట్టింది. తీరా సైన్య ఉపసంహరణ నిర్ణయం తీసుకుంది. అందుకు చింతించడం లేదని బైడెన్‌ ప్రభుత్వం తేల్చేసింది. రెండు దశాబ్దాల పాటు యుద్ధ క్షేత్రంగా మారిన అఫ్గాన్‌నూ, ఆ దేశ ప్రజలనూ వారి కర్మానికి వారిని వదిలేసింది. ఆడినమాట తప్పిన తాలిబన్లతో ఈ ప్రాంతమంతా అస్థిరమయ్యే అపాయం ఏర్పడింది. కాబట్టి, వారిని అదుపులో పెట్టే తక్షణ మార్గాంతరాన్ని చూడాల్సిన బాధ్యత అమెరికన్‌ ప్రభుత్వానికి చాలా ఉంది. ఒకపక్క తాలిబన్‌ ప్రతినిధులు దోహాలో చర్చలకు హాజరవుతున్నారు. మరోపక్క అఫ్గాన్‌ సర్కారుకు సన్నిహితులని అనుమానం ఉన్న పౌరులనూ, పట్టుబడ్డ సైనికులనూ తాలిబన్లు ఊచకోత కోస్తున్నారు. పులిట్జర్‌ ప్రైజ్‌ గెలిచిన ఫోటోగ్రాఫర్‌ డానిష్‌ సిద్దిఖీని క్రూరంగా చంపిన వైనం అందుకు ఓ మచ్చుతునక. తాలిబన్ల ద్వంద్వనీతికి ఇలాంటి నిదర్శనాలెన్నో. 

నిజానికి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ)కి ఈ నెల అంతా భారతదేశమే అధ్యక్షస్థానంలో ఉండనుంది. అదే ఆసరాగా మనం చొరవ తీసుకోవచ్చు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు కీలకమైన అమెరికా, రష్యా, చైనా, ఇరాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఐరోపా సమాజం లాంటి దేశాలన్నిటినీ ఒక తాటి మీదకు తేవచ్చు. తలకు తుపాకీ గురిపెట్టే తాలిబన్ల భయం లేకుండా, అఫ్గాన్‌ ప్రజలే తమ భవితను నిర్ణయించుకొనేలా ఆ దేశానికి ఒక రక్షణ కవచమిచ్చే ప్రణాళికను యోచించవచ్చు. ఇలా అంతర్జాతీయ సమాజం అంతా కలసి, తక్షణమే అఫ్గాన్‌లో శాంతిస్థాపనకు అవకాశం వెతకాలి. తాజా అధికార పంపిణీ ప్రతిపాదన ఆ దిశగా తొలి అడుగు కావచ్చు. దీనికి తాలిబన్లు ఎంత ఒప్పుకుంటారో, ఒప్పుకున్న మాటకు ఏ మేరకు కట్టుబడి ఉంటారో చెప్పలేం. 

అలాగని, ఏ ప్రయత్నమూ లేకుండా తాలిబన్ల చేతికే పూర్తిగా దేశాన్ని అప్పగించి, చేతులు దులుపుకుంటే తీవ్రవాదంపై పోరులో ఇన్నేళ్ళ కష్టం బూడిదలో పోసిన పన్నీరే! ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌), అల్‌–ఖైదా లాంటి తీవ్రవాద మూకలు అఫ్గాన్‌ను మళ్ళీ తమ అడ్డాగా మార్చుకొని, అంతా ఒక్కటవుతాయి. ఉపఖండంలోనూ, అంతర్జాతీయంగానూ దాడులకు తెగబడతాయి. ఇప్పటికే తాలిబన్లకు పాకిస్తాన్‌ అండ్‌ కో నుంచి ఆయుధాలు, ఆర్థిక నిధుల మొదలు దౌత్యసహకారం అందుతోంది. పైకి శాంతిసాధకురాలిగా కనిపిస్తూనే, తీవ్రవాదానికి పాక్‌ అండగా నిలుస్తోంది. పాక్‌  ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మాటలూ తాలిబన్లకే వంతపాడుతున్నాయి. పాక్‌పై, కనీసం అక్కడి సైన్యంపై ఐరాస ఆంక్షలు విధించాలన్న వాదన ఊపందుకొన్నది అందుకే! ఏమైనా, కాబూల్‌ గనక పూర్తిగా తాలిబన్ల ఏలుబడిలోకే వచ్చేస్తే, ఆ పర్యవసానం మనతో పాటు పరిసర అమెరికా, ఐరోపా, ఉత్తర ఆఫ్రికాలపైనా పడుతుంది. అఫ్గాన్‌లోని అస్థిరత ఇరాన్, మధ్య ఆసియా, కాశ్మీర్‌లకూ విస్తరించవచ్చు. అందుకే దుప్పట్లో మిన్నాగును పెట్టుకొని, కళ్ళు తెరిచి నిద్ర పోతే ముప్పు మనకే! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top