మూడే రోజులు... ఎన్నో అంశాలు

Sakshi Editorial On Narendra Modi Three Days USA Tour

కీలక సందర్భంలో జరుగుతున్న కీలకమైన సమావేశాలు. అత్యంత కీలకమైన పర్యటన. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటన సందర్భాన్ని ఒక్క ముక్కలో వర్ణించాలంటే – అంతే. రానున్న మూడు రోజుల్లో అమెరికా అనేక ప్రధానమైన ఘట్టాలకు వేదికగా నిలవనుంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన చతుర్భుజ కూటమి (క్వాడ్‌) దేశాల సదస్సు, ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వప్రతినిధి సభ సమావేశం, వివిధ దేశాల అంతర్జాతీయ నాయకులతో మోదీ సంభాషణలు, చర్చలతో అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షించనుంది. కోవిడ్‌ మహ మ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టాక పెద్దయెత్తున అంతర్జాతీయ నేతలు భౌతికంగా ఒకచోట చేరి, సంభాషించడం ఇదే తొలిసారి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం లాంటి తాజా పరిణామాలతో పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు లాంటివి ఈ మూడు రోజుల పర్యటనను భారత్‌కు ప్రధానమైనవిగా మార్చాయి. ఇటు బైడెన్‌తో వ్యక్తిగత భేటీలో, అటు ఐరాస సమావేశంలో దేశ ప్రయోజనాలను సమున్నతంగా నిలబెట్టడానికి మోదీ బృందం కసరత్తు చేసుకొని మరీ వెళుతోంది. 

గడచిన కొన్ని నెలలుగా వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ ప్రాధాన్యమున్న సమావేశాలు అనేకం వర్చ్యువల్‌గా సాగుతూనే ఉన్నాయి. ఇదే ‘క్వాడ్‌’ దేశాల సమావేశం ఈ మార్చిలో ఆన్‌లైన్‌ లోనూ సాగింది. ఈ నెల 17న షాంఘై సహకార మండలి సమావేశమూ జరిగింది. అంతకంతకూ పెద్దదవుతున్న ఉగ్రవాద భూతం గురించి అందులోనూ భారత్‌ లేవనెత్తింది. అయితే, ఈసారి భౌతిక సమావేశంలో దాన్ని మరింత బలంగా అందరి ముందుకూ తీసుకురానుంది. గత క్వాడ్‌ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను ముందుకు తీసుకెళ్ళే చొరవ ఇప్పుడు మనదే. పేద దేశాలను కోవిడ్‌ టీకాలతో ఆదుకొనే అంశానికి నిర్దిష్టమైన చర్యల అజెండా ఖరారు కానుంది. ఈ క్రమంలో ఇండో–పసిఫిక్, అఫ్గాన్‌ సమస్యలను పరిశీలిస్తూనే, చైనాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయవచ్చు. 

మరోపక్క యాపిల్‌ సహా అమెరికాలోని ప్రసిద్ధ సంస్థల సీఈఓలతోనూ మోదీ సమావేశ మవుతున్నారు. భారత, అమెరికాల మధ్య బంధాన్ని పటిష్ఠం చేయడం ఆయన ముందున్న సవాలు. నిజానికి, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కలసి ‘హౌడీ మోడీ’ సభలో పాల్గొని, మోదీ ప్రసంగించారు. మోదీ ప్రాచుర్యం ఎన్నికల్లో తనకు కలిసొస్తుందని ట్రంప్‌ ఆశ పడ్డారు కూడా! తీరా ట్రంప్‌పై బైడెన్‌ విజయం సాధించారు. ఆ తరువాత అమెరికాలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. భారత–అమెరికా ద్వైపాక్షిక సంబం ధాలపై బైడెన్‌తో మోదీ లోతుగా చర్చించనున్నారు. డెబ్భై రెండేళ్ళ క్రితం 1949లోనే రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య మొదలైన ద్వైపాక్షిక సంబంధాలకు ఇది కీలకమైన కొనసాగింపు కావాల న్నది భారత ఆకాంక్ష. అమెరికా తొలి మహిళా వైస్‌–ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌ను మోదీ కలుసు కోనున్నారు. ఇక, ఐరాస సర్వప్రతినిధి సభ 76వ సమావేశం సోమవారమే న్యూయార్క్‌లో ఆరం భమైంది. ఇది కూడా కరోనా అనంతర ప్రపంచంలో ఐరాస ప్రతినిధులందరూ పాల్గొంటున్న తొలి సమావేశాలు. రానున్న నవంబర్‌లో గ్లాస్గోలో కీలకమైన ‘ఐరాస వాతావరణ మార్పు సదస్సు’ (సీఓపీ 26) జరగాల్సి ఉంది. దానికి ముందస్తు సన్నాహంగా ఈ తాజా సమావేశం వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి అంశాలపై దృష్టి పెడుతోంది. ఇందులోనూ భారత్‌ది ప్రధాన భూమికే. అలాగే, మానవీయ సంక్షోభాన్ని నివారించడం కోసం అఫ్గాన్‌లోని కొత్త తాలిబన్‌ ప్రభు త్వంతో వ్యవహరించాల్సిన తీరుపై ఐరాస ఇచ్చిన పిలుపునకు వివిధ దేశాలు స్పందించనున్నాయి. తాలిబన్ల ద్వారా తన పబ్బం గడుపుకోవాలనుకుంటున్న పాకిస్తాన్‌ దురాలోచనకు అంతర్జాతీయ మద్దతుతో గండి కొట్టడం ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. 

అమెరికాను మంచి చేసుకుంటూనే, అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోవడం అవసరమైన ఈ పర్యటన ప్రాధాన్యం మన సర్కారుకు తెలుసు. అందుకే మోదీ సర్కారు టెలికమ్‌ రంగంలో అంతర్జాతీయ సంస్థలకు ఎదురైన ఇక్కట్ల అంశంపై అర్జెంటుగా దృష్టిపెట్టింది. మూడు ప్రైవేటు టెలికమ్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర ఇటీవల కేంద్రం భారీ రాయితీలివ్వడం ఈ అమెరికా పర్యటనలో మార్కుల కోసమేనని పరిశీలకుల వాదన. అంతర్జాతీయ కోవిడ్‌ నివారణ చర్యలూ చర్చకు రానున్న నేపథ్యంలో పర్యటనకు రెండు రోజుల ముందు భారత్‌ మళ్ళీ టీకాల ఎగుమతిని ప్రకటించడం గమనార్హం. ప్రపంచ దేశాలతో ‘వ్యాక్సిన్‌ మైత్రి’లో భాగంగా ఈ అక్టోబర్‌ నుంచి టీకాల ఎగుమతిని పునఃప్రారంభిస్తున్నట్టు భారత్‌ తెలిపింది. 2019 సెప్టెంబర్‌ అమెరికా పర్యటనలో ‘అబ్కీ బార్‌... ట్రంప్‌ సర్కార్‌’ అంటూ ట్రంప్‌ను గెలిపించాలంటూ ప్రవాసు లకు మోదీ పిలుపునిచ్చారు. సహజంగానే ఆ మాట డెమోక్రటిక్‌ పార్టీ యంత్రాంగానికి రుచించ లేదు. బైడెన్‌ సారథ్యంలోని డెమోక్రటిక్‌ ప్రభుత్వం మన జమ్మూకశ్మీర్‌లోని మానవహక్కుల లాంటి అంశాలపై గట్టిగానే గొంతు విప్పుతూ వస్తోంది. ఇప్పుడు డెమోక్రాట్‌ సర్కారుకు దగ్గరవడానికి మనం గట్టి ప్రయత్నమే చేస్తున్నాం. ఈ మూడు రోజుల పర్యటన అందుకు బలమైన పునాది వేసే సూచనలున్నాయి. అమెరికాతో దోస్తీతో ఉపఖండంలో చైనాకు చెక్‌ పెడుతూనే, అమెరికన్‌ మూసలో ఇరుక్కుపోకుండా భారత ప్రయోజనాలను కాపాడుకోవడమే ఇప్పుడు కీలకం. ఈ సమన్వయ, సమ తూక దౌత్యవిన్యాసమే ఇప్పుడు మోదీ బృందానికి ఉన్న పెనుసవాలు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top