బుల్‌డోజర్‌ రాజ్యం!

Jahangirpuri Civic Body Targets Illegal Houses Collapse Turns Violence - Sakshi

భారత రాజకీయ నిఘంటువులో కొత్తగా చేరిన పదం బుల్‌డోజర్‌. పరిహాసంగా మొదలైన బుల్‌ డోజర్‌ అనే మాట ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాస్త్రమై, చివరకు దేశమంతటా ఊడలు దిగుతోంది. మతఘర్షణలకు కారకులైన వారి ఇళ్ళనూ, ఆస్తులనూ బుల్‌డోజర్లతో కూల్చివేయడం మొదలుపెట్టి ‘బుల్‌డోజర్‌ బాబా’ అనిపించుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌. ఇప్పుడది అనేక బీజేపీ పాలిత ప్రాంతాలకు ఆదర్శమైంది. మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్‌లో శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్ళు రువ్వారని ఆరోపణలొచ్చిన చోట అక్కడి సీఎం శివరాజ్‌ చౌహాన్‌ ఇళ్ళ కూల్చివేతల మంత్రం ప్రయోగించి, ‘బుల్‌డోజర్‌ మామ’ అయ్యారు.

బుధవారం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఏకంగా 9 జేసీబీ బుల్‌డోజర్లతో అదే సీన్‌. కర్ణాటకలోని హుబ్బలి హింసాకాండలోనూ తక్షణ బుల్‌డోజర్‌ న్యాయం ప్రస్తావనే. మహారాష్ట్రలో నవనిర్మాణ సేన నేత రాజ్‌థాకరే ఏకంగా మసీదుల నుంచి ప్రార్థన పిలుపు (‘అజాన్‌)ను వినిపించే లౌడ్‌స్పీకర్లను మే 3 కల్లా తొలగించాలంటున్నారు. లేదంటే పోటీగా మరింత గట్టిగా హనుమాన్‌ చాలీసా వినిపిస్తామనీ తొడ కొడుతున్నారు. వెరసి, మనుషుల మధ్య మత విద్వేషాన్ని రగిలిస్తున్న తాజా ఘటనలు ఆందోళన రేపుతున్నాయి.

దేశరాజధాని ఘటనకొస్తే – పేరుకు ఢిల్లీ ఒకటే అయినా, సామాజిక, ఆర్థిక కోణాలలో అది అనేకానేక ఢిల్లీల సముదాయం. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చినవారు సైతం పలువురున్న జహంగీర్‌పురిలోని కుశల్‌చౌక్‌ ప్రాంతం కేవలం కొద్ది గజాల తేడాలోనే మందిరం, మసీదు – రెండూ ఉన్న శాంతియుత సహజీవన ప్రతీక. కానీ, పోలీసుల అనుమతి లేకనే, చేతులో కత్తులు, తుపాకులతో ఏప్రిల్‌ 16న సాగిన హనుమాన్‌ జయంతి యాత్ర రేపిన ఘర్షణతో తంటా వచ్చింది. కొద్దిరోజులుగా ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా, ఉద్విగ్నంగా మారిపోయింది. దోషులు ఎవరైనా శిక్షించాల్సిందే. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా, అవి ఏ వర్గానికి చెందినవైనా సరే చర్య చేపట్టాల్సిందే. కానీ, రోహింగ్యాలు, బంగ్లాదేశీల పేరుతో అమాయకులైన శ్రామికులకు, అదీ ఒకే వర్గానికి చెందినవారి షాపులనే కూల్చివేశారని ప్రత్యక్ష సాక్షుల కథనం. 1970ల నుంచి ఉన్న షాపుపై, అదీ అధికారిక కాగితాలన్నీ పక్కాగా ఉన్న దానిపై బుల్‌డోజర్‌ ప్రయోగం పరాకాష్ఠ. 

ఏళ్ళ తరబడిగా ఈ నిర్మాణాలున్నా, తాము అధికారంలోకి వచ్చి ఏళ్ళు గడిచినా... నిన్నటి దాకా గుర్తు లేని జహంగీర్‌పురి అక్రమ కట్టడాలు ఉన్నట్టుండి ఇప్పుడే తెరపైకి రావడమే విచిత్రం. పైపెచ్చు, కేవలం ఒక ధార్మిక స్థలం ముంగిట దుకాణాలనే కూల్చివేసి, ఆ పక్కనే ఉన్న మరో ధార్మిక స్థలం చుట్టూ నిర్మాణాల ఊసే ఎత్తకపోవడం మరీ విడ్డూరం. ముందస్తు నోటీసుల లాంటివేమీ లేకుండా, తెల్లవారుతూనే బుల్‌డోజర్లతో విరుచుకుపడడం అసాధారణం. యథాతథ స్థితి కొనసాగించాల్సిందిగా దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా సరే, ఆ తర్వాత కనీసం గంటన్నర సేపు కూల్చివేత సాగడం కోర్టు ధిక్కారం కాదా? అధికారిక ఉత్తర్వులు అందలేదనే మిషతో అధికారులు న్యాయస్థానం ఆదేశాన్ని సైతం పెడచెవిన పెట్టవచ్చా? నాలాపై అక్రమంగా నిర్మాణాలు ఉన్నాయన్నా, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందన్నా ఇన్నేళ్ళు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? తాజా శోభాయాత్ర ఘటనకు ప్రతిగానో, ప్రతీకారంగానో ఈ చర్య చేపట్టారంటే ఏం జవాబిస్తారు? 

యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ – అన్నిటా ఒకటే వర్గాన్ని లక్ష్యంగా చేసుకొన్న కూల్చివేతల్ని చూస్తే, మనుషుల్ని మరింతగా విడదీస్తున్నారని అనుమానాలు రేగడం సహజం. నిజానికి, ఈ నిరంకుశ రాజ్యాధికారానికి కూలిపోతున్నది ఇళ్ళు, షాపులు కాదు... న్యాయపాలన, రాజ్యాంగం. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినవారి నుంచి నష్టపరిహారం వసూలు ఆదేశాలతో మొదలుపెట్టిన యూపీ సర్కార్‌ రెండేళ్ళ క్రితం దాన్ని ఏకంగా చట్టం చేసింది. బుల్‌డోజర్లతో భయపెట్టడం యూపీ నుంచి ఢిల్లీ దాకా పాకింది. ఘర్షణలకు పాల్పడ్డారనే ఆరోపణతో ఇళ్ళ కూల్చివేత సామూహిక శిక్ష విధింపు కిందే లెక్క. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం కింద సామాన్యుడికి సంక్రమించిన గృహ నివాస హక్కును కాలరాయడమే అని నిపుణుల మాట. 

కొద్ది నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఒక పద్ధతి ప్రకారం మతవిద్వేష ప్రయత్నాలు, ఘర్షణలు సాగుతున్నాయి. అయితే ముందే పసిగట్టి, ఘర్షణల్ని నివారించడంలో వ్యవస్థాగత వైఫల్యం వెక్కిరిస్తోంది. మరో పక్క చట్టబద్ధంగా పని చేయాల్సిన పోలీసులను, పాలకుల ఆదేశా లను మాత్రమే పాటించే గులాములుగా మారుస్తుండడం ఇంకో సమస్య. సమాజంలోని సాంస్కృతిక, ధార్మిక భేదాలను గుర్తించి, అంగీకరించే పెద్ద మనసు ప్రజలకున్నా, పాలకులు ఉండనిచ్చేలా లేరు. జేసీబీ అంటే ‘జిహాద్‌ కంట్రోల్‌ బోర్డ్‌’ లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఏం చెప్పదలుకున్నారు? భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతిని ఏం చేయదలుచుకున్నారు? భావోద్వేగాలు పెంచి, పరమత సహనాన్ని హననం చేసినందు వల్ల ఎవరికి లాభం? ‘తొక్కుకుంటూ పోవాలె... ఎదురొచ్చినవాణ్ణి ఏసుకుంటూ పోవాలె’ లాంటి డైలాగులు సినిమాల్లో బాగుంటాయేమో కానీ, ప్రజాస్వామ్యంలో సరిపడవని పాలకులు మర్చిపోతే కష్టం. కూల్చివేస్తున్నది కట్టడాలను కాదు... శతాబ్దాల సహజీవన పునాదిపై నిర్మాణమైన సామరస్యాన్ని అని గ్రహించకపోతే సమాజానికే తీరని నష్టం. పాలకుడనే వాడు ఎప్పటికైనా గెలవాల్సింది – తాత్కాలికమైన ఎన్నికలను కాదు... విభిన్న వర్గాల ప్రజల మనసుల్ని!

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top