ఎప్పటిలాగే మహిళలు ఓడిపోయారు. వారికి లోక్‌సభలో, శాసనసభల్లో 33 శాతం కోటా కల్పించాలన్న ప్రయత్నం మరోసారి వీగిపోయింది. ఈసారి నియోజకవర్గాల పునర్వి భజనకూ, మహిళల కోటాకూ ముడిపెట్టడం అందుకు ప్రధాన కారణ మైంది. ఈ వ్యవహారం అంత తేలిగ్గా గట్టెక్కేది కాదని అందరూ భావిస్తూనే వచ్చారు. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 850కి పెంచటం, శాసనసభల్లోనూ గణనీయంగా సీట్లు పెంచటమే లక్ష్యంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించారు. అయితే ఈ పునర్విభజన అనంతరం మహిళలకు కోటా లభిస్తుందన్న మెలిక పెట్టడంవల్లే తాము వ్యతిరేకించక తప్పలేదని విపక్షాలు చెబుతున్నాయి.
ఇప్పుడున్న 543 స్థానాల్లోనే 33 శాతం కోటా కల్పించటంలో కేంద్రానికి అభ్యంతరమేమిటన్నది వాటి ప్రశ్న. ఏమైతేనేం శుక్రవారంనాటి రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండు వంతుల మెజారిటీ లభించాల్సి ఉండగా... బిల్లుకు మద్దతుగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటువేశారు. దీంతో ముడిపడివున్న మరో రెండు బిల్లుల్ని కేంద్రం ఉపసంహరించుకుంది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభమయ్యాక 2023 సెప్టెంబర్‌లో మహిళా కోటా బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు సభ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతగా ఏకాభిప్రాయం సాధించాక కూడా ఆ మరుసటి సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అది అమలు కాలేదు!
జనాభా లెక్కల సేకరణ ముగిసి, దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ముగించాకే కోటా అమలు వీలవుతుందని అప్పట్లో కేంద్రం తెలిపింది. జనాభా లెక్కల వ్యవహారం తేలేసరికి 2029 కూడా దాటొచ్చన్న సంశయాలున్న నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజనను తేల్చాలనీ, దానికి అనుగుణంగా మహిళల కోటాకు కూడా వీలు కల్పించాలనీ పునరాలోచన చేసి తాజా బిల్లుల్ని రూపొందించింది.
అదేమిటో... మహిళల కోటాకు ఏదోక రూపంలో ఎప్పుడూ అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. తొలిసారి 1996లో అప్పటి ప్రధాని దేవేగౌడ నాయకత్వంలోని ప్రభుత్వం, అటుతర్వాత ఐకె గుజ్రాల్ ప్రభుత్వం ప్రయత్నాలు చేశాయి. వాజ్‌పేయి హయాంలోని ఎన్డీయే ప్రభుత్వమైతే వరసగా 1998 మొదలుకొని 2003 వరకూ నాలుగుసార్లు కోటా బిల్లుకు ప్రయత్నం చేసింది. ఇక యూపీయే ప్రభుత్వం 2008, 2010ల్లో ప్రయత్నించింది. కానీ ప్రతిసారీ బిల్లు ప్రతుల్ని చించేయటం, కూటమి నుంచి తప్పుకుంటామని బెదిరించటం వగైరాలతో అన్ని రకాల ప్రయత్నాలూ వీగిపోయాయి.
అయితే అప్పు డొచ్చిన డిమాండ్లు న్యాయమైనవి. ఎస్‌పీ, బీఎస్‌పీ వంటివి ‘కోటాలో కోటా’ ఇచ్చితీరా లని అడ్డుకున్నాయి. స్వాతంత్య్రంవచ్చి ఇన్ని దశాబ్దాలవుతున్నా ఓబీసీలకు చట్టసభల్లో కోటా లేదని, మహిళల విషయంలోనైనా ఆ సంగతి తేల్చి తీరాలని ఆ పక్షాలు కోరాయి. ఈసారి పునర్విభజన ప్రక్రియ మహిళల కోటా విషయంలో సైంధవ పాత్ర పోషించింది.
గతంతో పోలిస్తే మన దేశంలో మహిళలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఎంతో రాణిస్తున్నారు. దాదాపు అన్ని రంగాల్లోనూ వారి పాత్ర గణనీయంగా పెరిగింది. కానీ మన చట్టసభల్లో ఇదెక్కడా ప్రతిబింబించకపోవటం సిగ్గనిపించదా? జనాభాలో సగం ఉన్నా కనీసం మూడోవంతు ఇవ్వటానికి కూడా సంసిద్ధత చూపకపోవటం మన ప్రజా స్వామ్యం తీరుతెన్నుల్ని ప్రశ్నార్థకం చేస్తోంది. మనతో పోలిస్తే ఎంతో వెనకబడిన దేశాలు సైతం ఈ విషయంలో విశాల దృక్పథంతో వ్యవహరిస్తున్నాయి. ఇరుపక్షాలూ దీన్నెక్కడా పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలా కనబడదు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో అధికారంలోకొచ్చాక అన్నిచోట్లా మహిళల ప్రాధాన్యాన్ని పెంచింది. అమ్మ ఒడి మొదలుకొని ఇళ్లస్థలాలపంపిణీ వరకూ... సచివాలయ ఉద్యోగాలు మొదలుకొని పంచాయతీరాజ్ సంస్థలవరకూ అన్నిచోట్లా మహిళలకు 50 శాతం కోటా ఉండేలా చూసింది. ఆఖరికి నామినేషన్ల పనుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ దాన్నే పాటించింది. కొన్ని సందర్భాల్లో ఆ శాతంకన్నా అధికంగానే ఇచ్చింది. చిత్తశుద్ధివుంటే చట్టం వచ్చేలోగానే చేయగలిగినంతా చేయొచ్చని నిరూపించింది. ఏదేమైనా శుక్రవారంనాటి పరిణామాలు విచారకరమైనవి. అటు మహిళల కోటాకూ, ఇటు దక్షిణాది రాష్ట్రాలకూ తమ పోకడలవల్ల ఒరిగిందేమీ లేదని విపక్షాలు గుర్తించటం మంచిది.


