షేర్ల అమ్మకం సరికాదు | - | Sakshi
Sakshi News home page

షేర్ల అమ్మకం సరికాదు

Jun 20 2026 12:25 AM | Updated on Jun 20 2026 12:25 AM

రాజమహేంద్రవరం రూరల్‌: జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రీ ఇన్సూరెన్స్‌లో కేంద్ర ప్రభుత్వం 5శాతం షేర్లు అమ్మాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాజమండ్రి డివిజన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఆర్‌జే మాథ్యూస్‌, ఎం.కోదండరామ్‌లు శుక్రవారం ప్రకటనలో ఖండించారు. ఇంతకు ముందు 2017లో 14.22 శాతం షేర్లు , 2024 సెప్టెంబర్‌లో 3.4 శాతం షేర్లు ఓఎఫ్‌ఎస్‌ ద్వారా అమ్మారన్నారు. ఇప్పుడు మరో 5 శాతం అమ్మడంతోప్రభుత్వ వాటా 77.4 శాతానికి పడిపోతుందన్నారు. ఇది చాలా ప్రమాదకరమని, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. లాభాల్లో నడుస్తున్న, వ్యూహాత్మకంగా ముఖ్యమైన జిఐసిరీ లాంటి సంస్థల్లో ప్రభుత్వ వాటాను మళ్లీ మళ్లీ తగ్గించడం ప్రమాదకర విధానమన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు డిస్‌ఇన్వెస్ట్‌మెంట్‌ టార్గెట్‌ సాధించాలని ప్రభుత్వం చెప్తోందన్నారు. కానీ తక్షణ డబ్బు కోసం దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరికాదన్నారు. జిఐసిరీ లో గానీ, మరే వ్యూహాత్మక ప్రభుత్వ ఆర్థిక సంస్థల్లో గానీ ఇకపై డిస్‌ఇన్వెస్ట్‌మెంట్‌ నిలిపి వేయాలన్నారు. ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచే విధానాలను ఏఐఈఈఏ గట్టిగా వ్యతిరేకిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించాలని ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోందన్నారు.

వారాహి మాతకు

వెండి వస్తువుల సమర్పణ

పెదపూడి: జి.మామిడాడ గ్రామం శివారు సూర్యనారాయణపురానికి చెందిన మల్లిడి శ్రీనివాసరెడ్డి లక్ష్మీకాంతం దంపతులు, వారి కుమారుడు సత్యనారాయణరెడ్డి (యూఎస్‌ఏ) గ్రామంలో ప్రసిద్ధి చెందిన వారాహి అమ్మవారికి సుమారు రూ.లక్షల విలుగల 650 గ్రాముల వెండితో శంకు, చక్ర,హస్తాలను తయారు చేయించారు. వాటిని మల్లిడి శ్రీనివాసరెడ్డి కూమార్తె అల్లుడు కర్రి దుర్గా అర్జున్‌రెడ్డి లలితా దంపతులు, వారి కుమార్తె వన్షికతేజస్విని రెడ్డి చేతుల మీదుగా మణికంఠ ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు శుక్రవారం అందజేశారు. అనంతరం శాస్త్రోక్తంగా సంప్రోక్షణ గావించి అమ్మవారికి వాటిని అలంకరించారు. దాత శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు కమిటీ తరఫున శేష వస్త్రాలను సమర్పించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ సత్తి భగవాన్‌రెడ్డి, కార్యదర్శి మండ రాజారెడ్డి, కోశాధికారి డీఆర్‌కే రెడ్డి, సభ్యులు సబ్బెళ్ల మోహనరెడ్డి, ద్వారంపూడి బాలవెంకట సత్యనారాయణరెడ్డి, నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి యువరాజారెడ్డి పాల్గొన్నారు.

టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో

93.90 ఉత్తీర్ణత శాతం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 2,772 మంది హాజరుకాగా, 2,603 మంది పాసయ్యారు. 93.30 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆ వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి కే.వాసుదేవరావు తెలిపారు. జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్‌ 5 వరకు జరిగాయి. ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రీ కౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 ఫీజు నిర్ణయించారు. ఈ నెల 20 ఉదయం 10 గంటల నుంచి 26వ తేదీ రాత్రి 11 గంటల వరకు సీఎఫ్‌ఎంఎస్‌ ఆన్‌లైన్‌ చలానా ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

కూటమి ప్రభుత్వానికి

బీసీలంటే చిన్నచూపు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపని వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్‌ కుమార్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ యాదవ, బీసీ సంఘాల ఆధ్వర్యాన శుక్రవారం జ్యోతిరావు ఫూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాజబాబు మాట్లాడుతూ, రెడ్‌బుక్‌ రాజ్యంగంలో భాగంగా వైఎస్సార్‌ సీపీ నాయకులకు అణగదొక్కుతున్నారని, బీసీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ఇటువంటి అక్రమ అరెస్టులకు కేరాఫ్‌గా నిలుస్తోందని దుయ్యబట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement