ఏలేశ్వరం: శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా పెద్దనాపల్లి గ్రామంలో గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లిబుజ్జి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం వెలగలేరు థియేటర్స్ వారి ఉరి నాటిక ఆలోచింపజేసింది. నేటి సమాజంలో మనిషికి ఇగో ఉంటే చివరికి ఎంతో నష్టపోతాడో సవివరంగా ప్రదర్శించారు. దీనికి రచన, దర్శకత్వం పోలుదాసు శ్రీనివాసరావు అందించారు. రెండో ప్రదర్శనగా కాకినాడ జీవీకే క్రియేషన్స్ వారి కన్నీటికి విలువెంత నాటిక ఆకట్టుకుంది. ఒక మహిళ డాక్టర్ తన స్వార్థంతో చేసిన పనిని తోటి మహిళలు తిరగబడి బుద్ధి చెప్పిన కథాంశంతో నాటిక ఆసక్తికరంగా సాగింది. దీనికి మూలకథ డి.కామేశ్వరి, నాటకీకరణ డి.ఉమాశంకర్ అందించగా, దర్శకత్వం డి.వినయ్ నిర్వహించారు. నాటిక ప్రదర్శనలు తిలకించేందుకు అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.


