పాత్ర రోజులొచ్చాయ్‌.. | - | Sakshi
Sakshi News home page

పాత్ర రోజులొచ్చాయ్‌..

Mar 31 2026 8:38 AM | Updated on Mar 31 2026 8:38 AM

కుమ్మరి చక్రంపై మట్టితో కూజా తయారు చేస్తున్న కార్మికుడు

పిఠాపురం: ఆరోగ్యమే మహాభాగ్యం.. అలాంటి ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది.. ఆధునికతతో వస్తున్న ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు కొత్తది వద్దు.. పాతదే ముద్దు అనే పరిస్థితి వచ్చింది. అందుకే ఎలాంటి హాని లేని మట్టి పాత్రలపై మోజు పెరుగుతోంది. దీంతో వీటికి పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్‌ వస్తువులదే అగ్రభాగం అయ్యింది. ఆధునిక పద్ధతులతో పాటు అంతే వేగంగా వ్యాధుల ముప్పు ఆందోళన కలిగిస్తోంది. ఉదయం వంట సాయంత్రానికే పాడవుతోంది. అదే మట్టి పాత్రలో వండితే వండినవి వండినట్లే ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అన్ని రకాల సౌలభ్యం. అందుకే మట్టి పాత్రలకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. సాధారణంగా మట్టి పాత్రల ప్రాధాన్యం తగ్గిపోయాక కుమ్మర్లు కుల వృత్తిని వీడి ఇతర వృత్తులకు చేరువయ్యారు. అక్కడక్కడా కొందరు మట్టి పాత్రలు తయారు చేసినా, కేవలం కొందరు మాత్రమే అదీ వేసవిలో మంచినీటికి, శుభకార్యాల్లో సంప్రదాయాలకు మాత్రమే వీటిని ఉపయోగించేవారు. ఇలా వీటి తయారీ తగ్గిపోయింది. కానీ ప్రకృతి వైద్యం ఆయుర్వేదం వంటి ఆరోగ్య సూచనలు పెరగడంతో ఎక్కువ మంది ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పూర్వ వైభవం వచ్చింది. తద్వారా వీటి తయారీ ఊపందుకుంది. మళ్లీ కుమ్మర్లకు చేతినిండా పని వచ్చింది. జిల్లాలో 500 కుటుంబాలు ప్రస్తుతం మట్టి పాత్రల తయారీ చేస్తుండగా, క్రమంగా వీటి సంఖ్య పెరుగుతోంది.

ఆ‘పాత్ర’మధురాలు

పూర్వం పాలు తాగినా, నీళ్లు తాగినా, అన్నం తిన్నా, పెరుగు తోడెట్టినా అన్నీ మట్టి పాత్రలోనే జరిగేవి. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టుగా మట్టి పాత్రలో వేసిన ప్రతీది ఒక అద్భుతంగా మారేది. మట్టి పాత్రలు కేవలం వంట పాత్రలు లేదా నిల్వ పాత్రలు మాత్రమే కాదు. అవి మన సంస్కృతీ సంప్రదాయం, గ్రామీణ జీవన విధానానికి ప్రతిబింబం. భారతీయ సంస్కృతిలో మట్టి పాత్రలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పూర్వం నుంచి మట్టి కుండల్లో నీరు నిల్వ చేయడం, ఆ పాత్రల్లో వంట చేయడం అనేది సాధారణం. పండగలు, ఉత్సవాలు, వివాహాలు, పూజలలో కూడా మట్టి పాత్రలు ముఖ్య పాత్ర పోషించేవి. దీపావళి సందర్భంగా వెలిగించే ప్రమిదలు, గ్రామీణ దేవాలయాలలో ఉపయోగించే మట్టి పాత్రలు ఇవన్నీ మన సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనాలు. వీటి తయారీ అనేది ఒక సాధారణ పనికాదు. ఇది అనుభవం, నైపుణ్యం, సహనం కలిసిన కళ. సరైన మట్టిని సేకరించాక శుభ్రపరిచి, నీటితో కలిపి మృదువుగా చేయడం, కుమ్మరి చక్రంపై చేతులతో ఆకారమివ్వడం, సూర్యరశ్మిలో ఆరబెట్టడం, అగ్నిలో కాల్చి దృఢంగా మార్చడం, కొన్నిసార్లు రంగులు వేసి అలంకరించడం ఇలా ఈ ప్రతి దశలో శ్రద్ధ అవసరం. ఒక చిన్న పొరపాటు మొత్తం పాత్ర రూపాన్ని మార్చేస్తుంది. కొన్ని గ్రామాల్లో వీటి తయారీకి ప్రత్యేకంగా ఒక వీధి ఉంటుంది. ఆ వీధిని స్థానికంగా కుమ్మర వీధి అని పిలుస్తారు. ఈ వృత్తినే నమ్ముకుని అక్కడ అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

కుండ బిర్యానీకి మంచి గిరాకీ

ప్రస్తుతం ‘సస్టైనబుల్‌ లివింగ్‌’ అనే భావన ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ నేపథ్యంలో మట్టి పాత్రల ప్రాముఖ్యత మళ్లీ పెరుగుతోంది. నగరాల్లో కూడా ఇప్పుడు మట్టి పాత్రలను ఉపయోగించే అలవాటు తిరిగి వస్తోంది. రెస్టారెంట్లు, ఆర్గానిక్‌ స్టోర్లు, హోమ్‌ డెకర్‌ రంగంలో కూడా మట్టి వస్తువులకు డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా బిర్యానీ ప్రియులు కుండ బిర్యానీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బిర్యానీ ప్రేమికుల అభిరుచికి తగినట్టుగా చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు సైతం తమ వద్ద కుండ బిర్యానీ లభిస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. కుండలు, కూజాలు, వాటర్‌ బాటిళ్లు వంట పాత్రలు ఇలా అనేక రకాల మట్టి పాత్రల తయారీ ఊపందుకుంది.

ఆదరణ పెరుగుతోంది

మా తాతల కాలం నుంచి ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాం. రాను రాను వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో తప్ప మట్టి పాత్రలను వినియోగించడం మానేశారు. ఈ పాత్రలను వినియోగించడం మన ఆ రోగ్యానికి, పర్యావరణానికి చాలా మంచిదని తెలుసుకున్న తరువాత వీటికి ఆదరణ పెరిగింది. ము ఖ్యంగా బిర్యానీ వంటి వంటకాలకు వీటిని వినియోగించడం వల్ల మాకు చేతి నిండా పని దొరుకుతోంది.

–ఎస్‌.అప్పారావు, మట్టి పాత్రల తయారీ కార్మికుడు,

పిఠాపురం

ఆరోగ్యానికి, ప్రకృతికి మేలు

మట్టి పాత్రలు వినియోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఇటు ప్రకృతికి మేలు జరుగుతుంది. మట్టి బిందెల్లో నిల్వ చేసిన నీరు సహజంగా చల్లగా ఉంటుంది. ఆహారం మెల్లగా వండబడటం, రసాయనాలు లేని సహజ వంట విధానం వల్ల పోషక విలువలు నిలుస్తాయి. పూర్తిగా సహజ పదార్థం మట్టితో తయారు చేయడం కారణంగా పర్యావరణానికి మేలు చేస్తుంది. ప్లాస్టిక్‌ వాడకాన్ని వీడడంతో కాలుష్యం తగ్గుతుంది.

ఫ మట్టి పాత్రలకు

పెరుగుతున్న ఆదరణ

ఫ కుమ్మర్లకు చేతినిండా పని

ఫ గడిలో పడిన బతుకు చక్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement