రౌతులపూడి: మండలంలోని ఉప్పంపాలెం సమీపంలో ఓ స్టోన్ క్రషర్‌లో పనిచేస్తున్న 11 మంది బీహార్ కార్మికులు సోమవారం అస్వస్థతకు గురై స్థానిక సీహెచ్‌సీలో చేరారు. ఇందులో నలుగురు వాంతులు, విరోచనాలు, మరో ఏడుగురు ఒళ్లు, కడుపు నొప్పి వంటి సమస్యతో బాధపడుతున్నారు. వీరికి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని సీహెచ్‌సీ వైద్యాధికారి ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. ఆరుగురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయగా, మిగిలిన ఐదుగురిని పూర్తిగా కోలుకునే వరకూ వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం స్టోన్ క్రషర్ సమీపంలో రోగులు తీసుకున్న ఆహార దినుసులను, చుట్టుపక్కల పరిశుభ్రత గురించి పరిశీలన చేసినట్లు ఆయన వివరించారు. డాక్టర్లు రాజాజీ, సరోజ, సౌమ్మశ్రీ రోగులకు చికిత్స అందిస్తున్నారు.
ఆదుకోండి.. ప్రాణం నిలపండి
కుమారుడి కోసం తల్లిదండ్రుల మొర
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన నాలుగేళ్ల కుమారుడి వైద్యానికి సాయం చేసి ఆదుకోవాలని బాధిత తల్లిదండ్రులు కోరారు. కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లికి చెందిన కోసూరి బాలాజీ కుమారుడు మోజెస్‌రాజు (4) ఎస్‌ఎంఎస్ టైప్ టూ వ్యాధి తో బాధపడుతున్నాడు. స్థానికంగా ఓ చెప్పులు దుకాణంలో బాలాజీ పనిచేస్తున్నాడు. అతని జీతం రూ.18 వేలు, ప్రస్తుతం మోజెస్‌రాజుకు ప్రతి నెలా వైద్యానికి రూ. 50 వేలకు పైగా ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో తమ కుమారుడిని ఆదుకోవాలని కోసూరి బాలాజీ సోమవారం పీజీఆర్‌ఎస్‌లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌కు వినతిపత్రం అందజేశారు. నడవలేని స్థితిలో ఉన్న తన కుమారుడిని ఇప్పటికే చాలా ఆసుపత్రులు తిప్పానని తెలిపారు. ఈ వ్యాధి నయం కావడానికి రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్లు చే యాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారని బాలా జీ అన్నారు. ప్రభుత్వం, దాతలు సహకరించి తన కుమారుడిని ఆదుకోవాలని ఆయన కోరారు. దాతలు సహాయం చేయాలనుకుంటే 92905 96660 నంబరులో సంప్రదించాలన్నారు.


