గోదారమ్మకు గర్భశోకం
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి నదీ తీరం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. నిబంధనలకు నీళ్లోదిలి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తోంది. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా తమనెవరు ప్రశ్నిస్తారని రెచ్చిపోతోంది. గోదావరి నదీ గర్భాన్ని కుళ్లబొడుస్తోంది. పది అడుగుల లోతు వరకూ ఇష్టానుసారంగా తవ్వేస్తూ సహజ సంపదను దోపిడీ చేస్తోంది. కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ దందా దర్జాగా సాగుతోంది. స్వయానా మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంతటి దోపిడీకి తెరతీసినా.. అటువైపు కన్నెత్తి చూసే నాథుడే కరవయ్యాడు. మూడు రోజులుగా దందా సాగుతున్నా.. ఏ ఒక్క అధికారీ అడ్డుకునేందుకు సాహసం చేయడం లేదు. నిత్యం లారీల కొద్దీ ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు కొల్లగొడుతున్నా చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక మతలబు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కాంట్రాక్టర్‌కు గడువు ముగిసినా..
నిడదవోలు నియోజకవర్గం ‘కానూరు–పెండ్యాల’ ఓపెన్ రీచ్‌లో మూడు రోజులుగా అనుమతులు లేకుండా ఇసుక యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ర్యాంపును గతేడాది దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు గడువు ముగిసింది. ఈ ఏడాది ఇంకా అనుమతులు ఇవ్వలేదు. అయినా తమను ఆపేదెవరంటూ ఇసుక మాఫియా బరితెగిస్తోంది. కూటమి నేతల కనుసన్నల్లో ర్యాంపు నిర్వహిస్తుండడంతో అక్రమాల పర్వం కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడిచి ఇసుకను తవ్వేస్తున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా తవ్వకాలు చేసి తరలించేస్తున్నారు. నిత్యం 400 లారీలకు పైగా ఇసుక భీమవరం, ఏలూరు, కృష్ణా జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
మూడు జేసీబీలు ఉపయోగించి మరీ..
యంత్రాలతో దర్జాగా తవ్వేస్తున్నారు. అన్ని అనుమతులు ఉండి.. రీచ్ దక్కించుకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు కూలీల ద్వారా నదిలో ఉన్న మేటల నుంచి ఇసుకను తవ్వాలి. లోడింగ్‌కు సైతం కూలీలనే ఉపయోగించాలి. గోదావరిలోకి యంత్రాలు, లారీలు తీసుకెళ్లడం నిషేధం. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి మచ్చుకై నా కనిపించడం లేదు. ఇష్టానుసారంగా యంత్రాలతో లోడింగ్ చేసేస్తున్నారు. వందల సంఖ్యలో లారీలో గోదావరిలోకి తీసుకెళ్లి ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. ‘కానూరు–పెండ్యాల’ రీచ్‌లో ప్రతి రోజూ మూడు జేసీబీలు ఇసుక తోడేందుకు వినియోగిస్తున్నారు. రాత్రిళ్లు అయితే మరింత రెచ్చిపోతున్నారు. కిలో మీటర్ల మేర వందల వాహనాలు క్యూ కడుతున్నాయి. యంత్రాలను నదిలోకి దించి పది అడుగుల వరకు గర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. ఒక్క ‘కానూరు–పెండ్యాల’ రీచ్ నుంచి ప్రతి రోజూ 400లకు పైగా లారీల ఇసుక అక్రమంగా తవ్వి, తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం.
నెలకు రూ.10 కోట్ల దోపిడీ
అసలే అక్రమ తవ్వకాలు ఆపై అధిక ధరకు విక్రయిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అనుమతులు ఉంటే.. ‘కానూరు–పెండ్యాల’ ఇసుక ర్యాంప్‌లో 6 యూనిట్ల లారీ ఇసుక రూ.1,900 వందలకు విక్రయించాల్సి ఉంది. కానీ రూ.5,500 నుంచి రూ.6,500 వరకు వసూలు చేస్తున్నారు. అక్కడి నుంచి బయట మార్కెట్‌లోకి వెళ్లే సరికి కిరాయితో కలిపి రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఇసుక లారీ ధర చేరుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఓపెన్ రీచ్‌లలో ఇసుక టన్ను రూ.35 నుంచి రూ.100 లోపు మాత్రమే ఉంది. బోటు ర్యాంపుల వద్ద టన్ను ఇసుక రూ.240 ధర పలుకుతోంది. 6 యూనిట్లకు రూ.3,000 మాత్రమే తీసుకుంటున్నారు. అయితే కానూరు–పెండ్యాల రీచ్ వద్ద మాత్రం ఏకంగా రూ.6,500 దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్క కానూరు–పెండ్యాల రీచ్ నుంచే ప్రతి రోజూ రాత్రి, పగలు 400కు పైగా లారీల ఇసుక అక్రమంగా తరలుతోంది. ఒక్కో లారీ ఇసుక రూ.6,500 చొప్పున రోజుకు 400 లారీలకు రూ.26 లక్షలు కూటమి నేతల జేబుల్లోకి వెళుతోంది. బిల్లులు కావాలంటే మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. మూడు రోజులుగా రూ.78 లక్షలు దండుకున్నట్లు విమర్శలున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒక్క ర్యాంప్ నుంచే నెలకు సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు దండుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది.
పరిమితులు లేకుండా..
అనుమతులు లేకుండా దర్జాగా తవ్వకాలు చేపడుతున్నా.. పరిమితులు లేకుండా లారీల ఇసుక తరలుతున్నా.. అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రహదారులపై లారీల ప్రవాహం కొనసాగుతున్నా అడ్డుకున్న దాఖలాలు లేవు. పైగా ఇసుక మాఫియాతో మైత్రి కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అనుమతులు లేకుండా ఎందుకు తవ్వుతున్నారు..?, ఎక్కడికి తరలిస్తున్నారు..? అని ప్రశ్నించిన సందర్భాలు లేవు. దీని వెనుక భారీ స్థాయిలో మామూళ్లు అందినట్లు ఆరోపణలున్నాయి. రీచ్ తెరిచే ముందే ఇసుక మాఫియా... అధికారులను మేనేజ్ చేసేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే ఇంత భారీ అక్రమం జరుగుతున్నా.. పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
ఎవరాపుతారు?
అనుమతులు లేకుండా తవ్వుతున్న వైనంపై మాఫియా తమకేమీ భయం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. తమకు ఓ ప్రజాప్రతినిధి, ఓ టీడీపీ నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయని, తమను ఆపేవారెవరన్న ధీమాతో ఉన్నట్లు తెలిసింది. కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతుండటం, అధికారులకు ఇప్పటికే ఆమ్యామ్యాలు అందడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది.
కలెక్టర్ స్పందిస్తేనే..
ఇసుక అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రీచ్‌లపై కలెక్టర్ స్పందిస్తే తప్ప తవ్వకాలు ఆగే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరపాలంటే భయపడేవారని, ప్రస్తుతం నిర్భీతిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొత్తగా జిల్లాకు వచ్చిన కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
లోడింగ్‌కు రీచ్‌లోకి లారీలు, ‘కానూరు–పెండ్యాల’ ఓపెన్ రీచ్‌లో ఇసుకను లారీల్లో నింపుతున్న జేసీబీ
మైనింగ్ అధికారుల లీలలు
ఇసుక మాఫియాను కాపాడేందుకు మైనింగ్ అధికారులు ఆగమేఘాలపై రంగంలోకి దిగారు. ‘కానూరు–పెండ్యాల’ ఇసుక ర్యాంపునకు 21.10.2024న టెండర్లు పిలిచారు. 13.03.2025 నుంచి 20.10.2025 వరకు ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు మైనింగ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వారి ప్రకటనను పరిశీలిస్తే.. కానూరు–పెండ్యాల ర్యాంపునకు అక్టోబర్ నెలలోనే తవ్వకాలకు గడువు ముగిసింది. అయినా ప్రస్తుతం యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. కానీ మైనింగ్ అధికారులు మాత్రం పశ్చిమగోదావరి జిల్లాకు పెండ్యాల ర్యాంప్‌ను కేటాయించినట్లు తాజాగా ప్రకటనలో తెలిపారు. అయితే ఇసుక తవ్వకాలు పెండ్యాల ర్యాంపులోనే జరగాల్సి ఉన్నా.. కానూరు–పెండ్యాల ర్యాంప్‌లో తవ్వకాలు యథేచ్ఛగా చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్రమాలకు ఏ స్థాయిలో సహకారం అందుతుందో అర్థమవుతోంది.
నదీ గర్భాన్ని కుళ్లబొడుస్తోన్న
ఇసుక మాఫియా
పది అడుగుల లోతు వరకూ
యంత్రాలతో తవ్వకాలు
‘కానూరు–పెండ్యాల’
ఓపెన్ రీచ్‌లో దర్జాగా దందా
మూడు రోజులుగా
నిరాటంకంగా అక్రమ బాగోతం
అనుమతులు లేకపోయినా బరితెగింపు
మంత్రి దుర్గేష్ నియోజకవర్గంలో
సహజ సంపద దోపిడీ
ప్రతి రోజూ 400 లారీలకు
పైగా అక్రమ రవాణా
రూ.కోట్లు దండుకుంటున్న
కూటమి నేతలు
మామూళ్ల మత్తులో కన్నెత్తి చూడని
మైనింగ్, రెవెన్యూ అధికారులు
గోదారమ్మకు గర్భశోకం
గోదారమ్మకు గర్భశోకం


