వెంకటరమణ చౌదరికే పగ్గాలు
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. జిల్లా అధ్యక్షుడిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి నియామకం దాదాపు ఖాయమైంది. దీంతో ఆరు నెలలుగా అధ్యక్ష ఎంపికపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర పడింది. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి జిల్లా రథసారథిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకటరమణ చౌదరికి పదవి కట్టబెట్టడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దళితులకు పదవి కేటాయించాలన్న డిమాండ్ సైతం తెరపైకి వచ్చింది. కానీ చౌదరికి అధిష్టానం అండదండలు, మంత్రి లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో పదవి వరించింది. ఇదిలా ఉంటే సీనియర్ నేతలకు అన్యాయం జరిగిందన్న వాదన ఆయా వర్గాల్లో వెల్లువెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కేఎస్ జవహర్ వ్యవహరించేవారు. ఆయనకు రాజ్యాంగ బద్ధమైన ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. ఆరు నెలలుగా అధ్యక్షుడి స్థానం ఖాళీగానే ఉంది.
సీనియర్లకు మళ్లీ భంగపాటు
● సైకిలెక్కేందుకు జిల్లాలో పలువురు నేతలు పోటీ పడ్డారు. వారి స్థాయిలో పావులు కదిపారు. సీనియర్ నేత గన్నికృష్ణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పదవిని ఆశించి భంగపడ్డారు. సీనియర్ నేత గన్నికృష్ణ వర్గం నేతలు సైతం త్రిసభ్య కమిటీ ఎదుట ఆయన పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. గన్నికృష్ణ ఇప్పటికే రాజమహేంద్రవరం మేయర్ పీఠం ఆశిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్, సిటీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వర్గ విభేదాలతో ఇప్పట్లో కార్పొరేషన్ ఎన్నికల జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. సీనియర్ నేత కావడంతో పదవి దక్కుతుందన్న భావనలో ఆయన వర్గం నేతలు ఉన్నారు.
● టీడీపీలో సీనియర్ నేత ముళ్లపూడి బాపిరాజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. మూడు దశల నామినేటెడ్ పదవుల భర్తీలో ఆయనకు స్థానం దక్కలేదు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవైనా ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. ఈ పరిణాం టీడీపీ సీనియర్ నేతలకు మింగుడుపడటం లేదు. పార్టీ పటిష్టతకు పాటుపడే వారికి గుర్తింపు దక్కడం లేదన్న వాదన వినిపిస్తోంది.
ఎట్టకేలకు టీడీపీ జిల్లా అధ్యక్ష
పదవి ఎంపిక కొలిక్కి
అధికారిక ప్రకటన
వెలువడటమే తరువాయి
రేసులో సీనియర్ నాయకులు
గన్ని కృష్ణ, ముళ్ళపూడి బాపిరాజు
లోకేష్ ఆశీస్సులు ఉన్న
వెంకటరమణ చౌదరికే పట్టం
సీనియర్ నేతలకు
మరోసారి మొండిచేయి
ఇప్పటికే నామినేటెడ్
పోస్టుల్లోనూ ఆశాభంగం


