రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు
అమలాపురం టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. దీనిపై అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు కథనం ప్రకారం.. అంబాజీపేట మండలం తొండవరం గ్రామానికి చెందిన ప్రస్తుతం అమలాపురంలో నివసిస్తున్న తోట వినయ్ (23), నిమ్మకాయల సాయివెంకట సత్యమూర్తిలు స్నేహితులు. మంగళవారం ఉదయం ఆ యువకులు అమలాపురం నుంచి మోటారు సైకిల్‌పై భీమవరం బయలు దేరారు. రోళ్లపాలెం 216 జాతీయ రహదారి బైపాస్‌లోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొంది. మోటారు సైకిల్ వెనుక వినయ్ కూర్చోగా, కాలు విరిగిపోయి తలకు గాయమైంది. అతడిని తక్షణమే రాజమహేంద్రవరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ బుధవారం మృతి చెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. అతనిది సాధారణ కుటుంబం. ఎదిగి వచ్చిన కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సత్య వెంకట సత్యమూర్తి అమలాపురంలోని ఓ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అమలాపురం పట్టణ ఎస్సై మనోహర్ జోషి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


