కోటిగళ గర్జన | - | Sakshi
Sakshi News home page

కోటిగళ గర్జన

Dec 16 2025 4:33 AM | Updated on Dec 16 2025 4:33 AM

కోటిగ

కోటిగళ గర్జన

సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్‌: వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జన‘కోటి’ గళాలు గర్జించాయి. చేవ్రాలుతో తమ నిరసన తెలిపాయి. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు.. పార్టీ శ్రేణులు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించింది. లక్షలాదిగా ప్రజలు, విద్యార్థులు, వివిధ వర్గాల వారు స్వచ్ఛంగా సంతకాలు చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి ఇటీవల వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయానికి వచ్చిన ఈ కోటి సంతకాల ప్రతులను.. ఇక్కడి నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చే కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. దీనికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచీ ప్రజలు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యాన భారీ ర్యాలీలుగా రాజమహేంద్రవరంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి జెండా ఊపి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం, సంతకాల ప్రతులను ఉంచిన వాహనం వెంట వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, ప్రజలు ద్విచక్ర వాహనాలపై పెద్ద ఎత్తున ర్యాలీగా కదిలారు.

15 కిలోమీటర్ల మేర..

రాజమహేంద్రవరంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయం నుంచి కొవ్వూరు నియోజకవర్గంలోని దొమ్మేరు వరకూ సుమారు 15 కిలోమీటర్ల మేర వేలాది ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సుమారు మూడు గంటలకు పైగా సాగింది. వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో పాటు అంచనాలకు మించి ప్రజలు కదం తొక్కారు. గోదావరి చిన్నబోయిందా అనే రీతిలో.. రోడ్డు కం రైల్వే వంతెనపై సాగిన ఈ ర్యాలీ జనకెరటం ఎగసి పడింది. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద పెట్టున నినదించారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరవడం చూస్తూంటే ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యుడు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర తెలికుల, గాండ్ల కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ సంకిన భవానీప్రియ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా శ్రీనగేష్‌, నక్కా రాజబాబు, గిరజాల బాబు, గొందేశి శ్రీనివాసులురెడ్డి, అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ, రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బూరుగుపల్లి సుబ్బారావు, క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్‌ విజయ సారథి, వివిధ విభాగాల జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

4.20 లక్షల సంతకాల సేకరణ

కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల సంతకాలు సేకరించాం. విద్యార్థులు, యువత, మేధావులు, వెద్య వర్గాలు, పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా సంతకాలు చేసి, ఈ ఉద్యమాన్ని విజయవంతం చేశారు. పేదలకు వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ఎట్టి పరిసి్థ్తుల్లోనూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జరగనివ్వం. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రూ.లక్షల కోట్ల అప్పులు చేస్తున్న చంద్రబాబు.. వైద్య కళాశాలలకు రూ.5 వేల కోట్లు ఇవ్వకపోవడం దారుణం. ఇది ఆరంభం మాత్రమే. ఇకపై తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం.

– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి

సూపర్‌ సక్సెస్‌

కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజలు కదం తొక్కారు. పేదలకు వైఎస్‌ జగన్‌ అండగా నిలిస్తే.. కార్పొరేట్‌ సంస్థలకు దన్నుగా చంద్రబాబు నిలుస్తున్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకూ వైఎస్సార్‌ సీపీ పోరాటం ఆగదు.

– తిప్పల గురుమూర్తిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు, రాజమహేంద్రవరం

ధనార్జనే చంద్రబాబు ధ్యేయం

పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాల ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కేవలం ధనార్జనే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరిస్తోంది. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు పెట్టారు. ఈ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను చంద్రబాబు సర్కార్‌ వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో సర్కార్‌ మెడలు వంచైనా నిలుపు చేస్తాం.

– జక్కంపూడి రాజా, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు,

మాజీ ఎమ్మెల్యే, రాజానగరం

చంద్రబాబుకు చెంపపెట్టు

చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టేలా ప్రజలందరూ తరలి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఇది చంద్రబాబుకు చెంప పెట్టు లాంటిది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆ సంతకాలను గవర్నర్‌కు అందజేయనున్నాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు ఒక్క మెడికల్‌ కళాశాల కూడా తీసుకురాలేదు. అటువంటిది వైఎస్‌ జగన్‌ తెచ్చిన కళాశాలలను ప్రైవేటీకరించడానికి ఆయనెవరు? తన బినామీలకు మెడికల్‌ కళాశాలలను అందించే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారు. ఏడాదికి 2,300 మంది డాక్టర్లు, పదేళ్లకు 23 వేల మంది పేద విద్యార్థులు డాక్టర్లు అవడాన్ని బాబు సహించలేకపోతున్నారు.

– మార్గాని భరత్‌రామ్‌, వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ

చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం

కదం తొక్కిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, ప్రజలు

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన నిరసన

కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన

తాడేపల్లికి సంతకాల ప్రతుల తరలింపు

15 కిలోమీటర్ల మేర భారీ బైక్‌ ర్యాలీ

జెండా ఊపి ప్రారంభించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు

దొమ్మేరు వద్ద వాహనానికి వీడ్కోలు

కోటిగళ గర్జన1
1/5

కోటిగళ గర్జన

కోటిగళ గర్జన2
2/5

కోటిగళ గర్జన

కోటిగళ గర్జన3
3/5

కోటిగళ గర్జన

కోటిగళ గర్జన4
4/5

కోటిగళ గర్జన

కోటిగళ గర్జన5
5/5

కోటిగళ గర్జన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement