పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 23 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు (పీజీఆర్‌ఎస్) 23 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో నేరుగా ఫోనులో మాట్లాడారు. ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు.
పీజీఆర్‌ఎస్‌కు 180 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు 180 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) టి.సీతారామమూర్తి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సకాలంలో అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని అన్నారు. అర్జీల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలను ఐవీఆర్‌ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయిలో సమీక్షిస్తున్నారని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన, సరైన సమాచారం ఇవ్వని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పులి సంచారంపై ఆధారాల్లేవ్
గోపాలపురం: మండలంలోని భీమోలు మెట్టపై పులి సంచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలూ లభించలేదని జిల్లా అటవీ శాఖ అధికారి కె.దావీదురాజు తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పులి జాడను గుర్తించేందుకు ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజులుగా పులి జాడలు కనిపించలేదని చెప్పారు. పులి సంచారంపై ఎటువంటి అపోహలకూ గురి కావద్దని కోరారు. భీమోలు, సగ్గొండ, గోపవరం కొండలపై రెస్క్యూ టీము ద్వారా పులి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఎవరికై నా ఎటువంటి జంతువుల పాదముద్రలు లేదా అనుమానాలున్నా అటవీ శాఖ, గ్రామ రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేయాలని సూచించారు.
13.99 వేల మెట్రిక్ టన్నుల
యూరియా విక్రయం
దేవరపల్లి: జిల్లాలో అక్టోబర్ 1 నుంచి సోమవారం వరకూ 13.99 వేల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్టు జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న 17 రోజులకు 5.48 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 7.54 వేల మెట్రిక్ టన్నులు రైతులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ నెలాఖరుకు మరో 8.29 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు రానున్నాయని తెలిపారు. రబీలో అన్ని రకాల ఎరువులూ కలిపి జిల్లాకు 1,15,781 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, 43,686 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 24,476 మెట్రిక్ టన్నులు విక్రయించినట్టు తెలిపారు. ప్రస్తుతం 19,216 మెట్రిక్ టన్నులు రైతులకు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
సత్యదేవునికి ఘనంగా
ఏకాదశి పూజలు
అన్నవరం: మార్గశిర బహుళ ఏకాదశిని పురస్క రించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం ఉదయం స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ, తులసి దళాలతో సహస్ర నామార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరచి సుప్రభాత సేవ నిర్వహించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. సత్యదేవుడు, అమ్మవారిని ముత్యాల కవచాలతో అలంకరించి పూజించారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 23 ఫిర్యాదులు


